జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం..
1 min readప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలి
చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ రావు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలనీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ అధికారులకు సూచించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు హాలులో మంగళవారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ అధ్యక్షులు ఘంటా పద్మశ్రీ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్, ఉంగుటూరు శాసనసభ్యులు పుప్పాల శ్రీనివాసరావు (వాసు బాబు) పశ్చిమగోదావరి జిల్లా రెవిన్యూ అధికారి నారాయణ రెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ కె. సుబ్బారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ మండల పరిధిలో జరిగే పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో స్థానిక ఎంపిపి, జెడ్పిటిసి, సర్పంచి వంటి స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం అందించాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారలోపం జరిగినట్లు ఫిర్యాదులు వస్తే సదరు అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా పరిషత్ సమావేశాలలో వివిధ శాఖల పనులకు సంబంధించి సభ్యులు వెలిబుచ్చిన సమస్యల పై తీసుకున్న చర్యలను సంబంధిత మండల స్థాయి ప్రజాప్రతినిధులకు కూడా తెలియజేయాలన్నారు. పేదప్రజల సంక్షేమానికి సామజిక, ఆర్ధిక, రాజకీయాలకు అతీతంగా పధకాలను అమలు చేయడంతో పాటు సమాజంలోని అన్ని వర్గాలకు సామజిక న్యాయం అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి నవరత్నాల కార్యక్రమం కింద మానిఫెస్టో లో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చారన్నారు. ప్రభుత్వ పథకాలలో ఎటువంటి అవినీతికి తావులేకుండా లబ్దిదారులకు నేరుగా వారి అకౌంట్ లోనే జమ చేయడం జరుగుతున్నదన్నారు. పంచాయతీ రాజ్, ఉపాధి హామీ పధకం, ఆర్ డబ్ల్యూ.ఎస్., తదితర శాఖల ద్వారా మంజూరైన పనులను వేగవంతంగా పూర్తి చేయాలనీ, అనంతరం పనులకు సంబంధించి బిల్లులను వెంటనే అప్లోడ్ చేయాలన్నారు. సభ్యులు తెలియజేసిన సమస్యలపై జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ స్పందిస్తూ వేలేరుపాడు మండలంలోని రేపాకగొమ్ము, తోటకూరగొమ్ము, దాచారం, కొయిదా, తదితర గ్రామాలలో తాగునీటి సమస్య కు మంచినీటి బోర్లు ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో రోడ్లకు మరమ్మతులు చేయాలనీ అధికారులను ఆదేశించారు. జలకళ బోర్లు ఏర్పాటు, ఇళ్ల స్థలాల మంజూరు, నాడు నేడు పనుల ప్రగతి, తదితర అంశాలపై సభ్యులు తెలియజేసిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ అభివృద్ధి పధకాలకు సంబంధించి పూర్తి చేసిన పనుల బిల్లులను వెంటనే ఆన్లైన్ లో నమోదు చేయాలనీ అధికారులను ఆదేశించారు. పేదల ఇళ్ల పధకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలు మంజూరు అయినవెంటనే పనులు ప్రారంభించాలన్నారు. జిల్లాలో జగనన్న భూ హక్కు, భూసర్వే కార్యక్రమం కింద అధునాతన పద్దతిలో డ్రోన్ల ద్వారా రీ సర్వే కార్యక్రమాన్ని చేపట్టామని, సదరు జాబితాలను సంబంధిత గ్రామ పంచాయతీ కార్యాలయాలలో ప్రదర్శించడం జరిగిందన్నారు. సర్వే అనంతరం సదరు భూ యజమానులు నుండి సక్రమంగా ఉన్నాయని అంగీకారం తీసుకుంటారని, యజమానులు అభ్యంతరం వెల్లడించినట్లైతే సదరు సమస్య పరిష్కరించి, తరువాత మాత్రమే భూ హక్కు సర్వే పత్రం ముద్రించి సదరు రైతుకు అందించడం జరుగుతుందని సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కలెక్టర్ చెప్పారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా మంజూరైన పనులను వెంటనే పూర్తి చేయాలనీ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో సభ్యులు లేవనెత్తిన సమస్యను మినిట్స్ లో నమోదు చేసి, తదుపరి సమావేశంలో సదరు సమస్యపై తీసుకున్న చర్యలను తెలియజేయాలన్నారు. ఉంగుటూరు శాసనసభ్యులు పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు) మాట్లాడుతూ ఉంగుటూరు నియోజకవర్గంలో నాడు-నేడు కార్యక్రమం కింద నిర్మిస్తున్న పాఠశాలల అదనపు తరగతి గదులు, అంగన్వాడీ భవనాలు, ఇతర నిర్మాణ పనులలో కొన్ని 90 శాతం పూర్తి అయ్యాయని, డోర్లు, ఫర్నిచర్ వంటి కొన్ని సౌకర్యాలు కల్పించినట్లయితే వెంటనే వినియోగంలోకి తీసుకురావచ్చన్నారు. అధికారులు ఈ దిశగా పనిచేయాలని కోరారు. గృహ నిర్మాణాలకు సంబంధించి బిల్లులను వెంటనే ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలనీ కోరారు. ఈ సందర్భంగా జాతీయ రహదారిలో కలపర్రు నుండి గుండుగొలను మధ్య రోడ్లు గుంతల కారణంగా వాహనాలు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఆ ప్రాంతంలో రహదారి మరమ్మత్తు పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ జిల్లా కలెక్టర్ ను కోరారు. సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ కె. సుబ్బారావు, పశ్చిమ గోదావరి జిల్లా రెవిన్యూ అధికారి నారాయణ రెడ్డి, డి ఆర్ డి ఏ పీడీ విజయరాజు, గృహనిర్మాణ శాఖ పీడీ కె. రవికుమార్, వ్యవసాయశాఖాధికారి వై. రామకృష్ణ, ఇరిగేషన్, పంచాయతీ రాజ్, ఆర్ డబ్ల్యూఎస్, ట్రాన్స్కో సూపెరింటెండింగ్ ఇంజినీర్లు శ్రీనివాసరావు, కేదారేశ్వరరావు, సత్యనారాయణ, సాల్మన్ రాజు,డి ఎం హెచ్ ఓ డా. శర్మిష్ఠ, డ్వామా పీడీ ఏ . రాము, జెడ్పిటీసి లు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రనిధులు పాల్గొన్నారు.