సూర్య దేవా నమస్తుభ్యం…!
1 min read16న రథసప్తమి వేడుకలు.
నందికొట్కూరులో ప్రసిద్ధి గాంచిన శ్రీ ఛాయా ఉషా సమేత సూర్య దేవాలయం .
పల్లెవెలుగు వెబ నందికొట్కూరు: ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమభాస్కరదివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే iiమాఘ శుద్ద సప్తమినే రథసప్తమి అంటారు. అంటే సూర్య భగవానుడి పుట్టిన రోజు అన్నమాట. మాఘ శుద్ద సప్తమినాడు సూర్యుడు తొలిసారి రథం అధిరోహించి భూమి పై అవతరించాడంట. అందుకే రధసప్తమిని పవిత్రమైన రోజుగా భావిస్తారు. రథసప్తమి ప్రాశస్త్యాన్ని వేద పండితులు ఆలయ పురోహితులు నాగభూషణ రావు వివరిస్తున్నారు. రథసప్తమి ప్రాశస్త్యాము..రామాయణంలో రామ, రావణ యుద్ధ సమయంలో అగస్త్య మహర్షి శ్రీరాముడికి ఆదిత్య హృదయం ఉపదేశించారు. శ్రీరాముడు ఆదిత్య హృదయం పఠించిన ఫలితంతోనే రావణ సంహారం చేశాడు. ఆంజనేయుడు సాక్షాత్తు ఆది దేవుడి వద్దే విద్య చేశాడు. మహాభారతంలో పాండవులు అరణ్యవాసం సమయంలో ధర్మరాజు ఆపత్కాలంలో సూర్యుణ్ణి ప్రార్థించి అక్షయ పాత్రను పొందాడు. భాగవతంలో సత్రాజిత్తుకు శమంతకమణిని ప్రసాదించినది సూర్యుడే.రథసప్తమికి వాతావరణ పరంగా ప్రాధాన్యత ఉంది ఈ రోజు నుంచి సూర్యగమనంలో మార్పు వస్తుంది. శీతాకాలం నుంచి వసంత, గ్రీష్మ రుతువుల దిశగా మార్పులు సంభవించే కాలం.రథసప్తమి రోజు బ్రాహ్మీ ముహూర్తంలో ఆకాశంలోని ప్రధాన నక్షత్రాలన్నీ రథం ఆకారంలా, సూర్యరధంలా రూపు దిద్దుకుంటాయి. సూర్యుడికి సంబంధించి ఏడు సంఖ్య ఎంతో విశిష్టమైనది. తిధులలో సప్తమి ఏడో రోజు. సూర్యుడి గుర్రాలు ఏడు. సూర్యకాంతిలోని వర్ణాలు ఏడు. కనుక సూర్యారాధన ఎంతో విశిష్టమైనది.కనుకనే ఆదిత్య హృదయం నిత్యం పారాయణ చేయడంవల్ల అనేక శుభాలు చేకూరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.అమావాస్యనాడు ఆదివారం వస్తే భాను అమావాస్య అని, ఆదివారంతో సప్తమి వస్తే భాను సప్తమి అంటారు. ఆ రోజుల్లో సూర్య భగవానుడిని విశేష పూజలతో కొలుస్తారు. సూర్య గ్రహశాంతులు, హోమాలు, అభిషేకాలు, జిల్లేడు ఆకు పూజలూ నిర్వహిస్తారు. జిల్లేడు ఆకులంటే సూర్యుడికి ఎంతో ప్రీతి. వీటినే అర్కపత్రాలనీ అంటారు.
సూర్యనారాయణ స్వామి ఆలయం చరిత్ర..
రథ సప్తమి అనగానే కోణార్కలో సూర్యదేవాలయం, శ్రీకాకుళం జిల్లాలోని సూర్యదేవాలయం స్ఫురణకు వస్తాయి. ఇదే తరహాలో చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత గల శ్రీ ఛాయా ఉషా సమేత సూర్య దేవాలయం నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఉంది. ఈ క్షేత్రంలో ఉత్తరాయణ పుణ్య కాలంలో ప్రాతఃకిరణాలు నేరుగా స్వామివారి పాదాల్ని స్పృశిస్తాయి. ఆలయం మధ్యలో కూర్మయంత్రం ఉండటం మరో విశేషం. కనుకనే ఇక్కడ సూర్యారాధన చేసిన వారికి ఉత్తమఫలితాలు ప్రాప్తిస్తాయని చెబుతారు.పదమూడో శతాబ్దంలో ఈ ప్రాంతానికి వేటకు వచ్చిన చోళ రాజు సిరిసింగరాయలు అలసి ఓ చెట్టు నీడన సేద తీరాడు. ఆ సమయంలో సూర్య భగవానుడు స్వప్నంలో సాక్షాత్కరించి తనకు అక్కడోక ఆలయం నిర్మించమని ఆదేశించాడట. సిరిసింగరాయలు తదనుగుణంగానే చక్కని సూర్యాలయాన్ని కట్టించాడని చరిత్ర చెబుతోంది.నందికొ్ట్కూరు సూర్య దేవాలయంలో స్వామివారి రూప లావణ్యం అపురూపం. అత్యంత తేజోమయం. మాటలలో వర్ణించలేం. కుడి చేతిలో తెల్లని పద్మం ఉంటుంది. అభయ ముద్రలో ఎడమచేయి కనిపిస్తుంది. చోళుల పాలన అంతరించిన తర్వాత ఎంతో మంది రాజులు ఈ స్వామి వారిని కొలిచారు. కాలక్రమంలో ఆ చారిత్రక ఆలయం శిథిలావస్థకు చేరుకోగా దాదాపు ఇరవై ఐదు యేళ్ల క్రితం భక్తులంతా పూనుకుని జీర్ణోద్ధారణచేశారు. రథసప్తమినాడు ఈఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం అంగ రంగ వైభవంగా జరుగుతుంది. ఆ రోజు స్వామి దర్శనానికిఎక్కడెక్కడినుంచో భక్తులుతరలివస్తారు. నంద్యాల జిల్లా కు 70కి.మీ
కర్నూలుకు 35 కిలోమీటర్లదూరంలో నందికొట్కూరు పట్టణం ఉంది.సూర్యోదయం జరిగే తూర్పు దిక్కునే ముందుగా సృష్టించాడట బ్రహ్మ. మాఘ శుద్ధ సప్తమినాడు తొలిసారిగా సూర్యుడు ఏడుగుర్రాల రథమెక్కి వచ్చి కర్మసాక్షిగా బాధ్యతలు స్వీకరించాడంటారు. ఆ సందర్భంగానే ఏటా రథసప్తమి జరుపుకుంటాం. సూర్యవ్రతాన్నీనిర్వహిస్తాం. ఆ రోజు, తల మీద ఏడు జిల్లేడు ఆకులు కానీ రాగి ఆకులు కానీ పెట్టుకుని తల స్నానం చేయడం సంప్రదాయం. కొత్త బియ్యం, కొత్త బెల్లంతో వండిన పాయసాన్ని చిక్కుడు ఆకుల మీద వడ్డించి, నైవేద్యంగా పెడతారు. ముంగిళ్లలో రథం ముగ్గేసి సూర్యనారాయణుడికి ఆహ్వానం చెబుతారు. భక్తి శ్రద్ధలతో ఆదిత్యహృదయం పారాయణ చేస్తారు.
16 న రథసప్తమి వేడుకలు..
నందికొట్కూరు పట్టణం కోట వీధిలోని సూర్యనారాయణ స్వామి దేవాలయంలో 16 శుక్రవారం నుంచి రథసప్తమి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఆలయాన్ని ముస్తాబు చేశారు. మొదటి రోజు గణపతి, గంగపూజ, నవగ్రహారాధన, కలశ స్థాపన, దీక్షా హోమం, మృత్యుంజయ హోమాలు జరుగనున్నాయి. శుక్రవారం రథసప్తమిని పురష్కరించుకుని వేకువజామున 5 నుంచి ఉదయం 7గంటల వరకు ఈశ్వరునికి పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం, సూర్యునికి మహాసౌర పూర్వక అరుణ రుద్రాభిషేకం, ఉదయం 7 నుంచి 9:30 గంటల వరకు ఛాయా ఉష సమేత సూర్యనారాయణస్వామి కల్యాణం, గణపతి, నవగ్రహ, మృత్యుంజయ హోమాలు ,సాయంత్రం 3 గంటల నుంచి రథోత్సవం నిర్వహిస్తారు. రథసప్తమికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని, అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ పురోహితులు నాగభూషణ రావు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్నదానం, తాగునీరు, చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నామని కమిటి సభ్యులు వివరించారు.