దక్షిణాది రాష్ట్రాల విద్యార్థుల సదస్సును జయప్రదం చేయండి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: AIDSO ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్యను కాపాడాలని, జాతీయ నూతన విద్యా విధానం – 2020కి వ్యతిరేకంగా ఫిబ్రవరి 17వ తేదీన చెన్నైలో జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల విద్యార్థుల సదస్సును జయప్రదం చేయాలని నగరంలోని పలు కళాశాలలో సమావేశాలు నిర్వహించారు…ఈ కార్యక్రమంలో AIDSO రాష్ట్ర అధ్యక్షులు వి. హరీష్ కుమార్ రెడ్డి, నగర కార్యదర్శి హెచ్. మల్లేష్ మాట్లాడుతూ – కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ నూతన విద్యా విధానం – 2020 ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా దూకుడుగా, ప్రజాభిప్రాయాన్ని ఖాతరు చేయకుండా, క్షేత్రస్థాయిలోని పరిస్థితులను గమనించకుండా ఏకపక్షంగా 3,4,5 తరగతులను హైస్కూల్ లో విలీనం చేసి, పేద విద్యార్థులకు విద్యను దూరం చేసిందని తెలిపారు… అలాగే నాలుగేళ్ల డిగ్రీని, CSP, ఇంటర్న్ షిప్ ప్రవేశపెట్టడం కారణంగా విద్యార్థులకు, అధ్యాపకులకు నిరుద్యోగ యువతకు మొత్తం ఉన్నత విద్య యొక్క మౌలిక సూత్రాలకే నష్టం జరుగుతుందని ఇప్పటికే మేధావులు, విద్యావేత్తలు, అధ్యాపకులు వ్యక్తం చేశారని గుర్తు చేశారు… క్షేత్రస్థాయిలోని పరిస్థితిలను దృష్టిలోకి తీసుకొని ఉన్నత విద్యలో మంచి మార్పులపై విద్యావేత్తలు, మేధావులు, అధ్యాపకులతో చర్చలు చేయాలని డిమాండ్ చేశారు.ఇలాంటి పరిస్థితుల్లో ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ దేశంలోనూ, రాష్ట్రంలోనూ అనేక సభలు, సమావేశాలు, సెమినార్లు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. అందులో భాగంగా దేశంలోను, రాష్ట్రంలోనూ ప్రత్యామ్నాయ విద్యా విధానానికై ఫిబ్రవరి 17వ తేదీన చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల విద్యార్థుల సదస్సును నిర్వహిస్తుందని అన్నారు. ఈ మహాసభలో ముఖ్య ఉపన్యాసకులుగా ప్రముఖ చరిత్రకారుడు ప్రొఫెసర్ ఏ కరుణానందన్, రిటైర్డ్ వైస్ ఛాన్సలర్ జవహర్ నేసన్, రిటైర్డ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు శ్రీ కె చంద్రశేఖర్ తదితరులు హాజరయ్యి విద్యారంగ సమస్యలు, వాటి పరిష్కారం గురించి ఉపన్యాసిస్తారని అన్నారు… కావున ఈ సదస్సును జయప్రదం చేయడానికి మేధావులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, భావితరాల శ్రేయస్సును కోరుకునే ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.