PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉమ్మడి జిల్లాలో  9 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించిన అధిష్టానం

  • సంబరాలు చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు
  • ఎన్నికల సమరానికి ‘సై’అంటున్న అభ్యర్థులు
  • డోన్​– కోట్ల జయ సూర్య ప్రకాశ్​ రెడ్డి
  • కర్నూలుకు టీజీ భరత్​
  • పాణ్యం– గౌరు చరితారెడ్డి
  • కోడుమూరు – బొగ్గుల దస్తగిరి
  • పత్తికొండ– కేఈ శ్యాంబాబు
  • నంద్యాల– ఎస్​ఎండి ఫరూక్​
  • ఆళ్లగడ్డ – భూమా అఖిలప్రియ
  • శ్రీశైలం – బుడ్డా రాజశేఖర్​ రెడ్డి
  • బనగానపల్లె– బీసీ జనార్ధన్​ రెడ్డి

రాయలసీమ ముఖద్వారమైన కర్నూలులో ఎన్నికల వేడి… మరింత హీటెక్కింది. ఇప్పటి వరకు అధిష్ఠానం నిర్ణయం కోసం ఎదురు చూసిన తెలుగు తమ్ముళ్లకు… టీడీపీ–జనసేన పార్టీల తొలిజాబితా జోష్​ నింపినట్లయింది. జాబితాలో భాగంగా ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ 94, జనసేన పార్టీకి 5 అసెంబ్లీ అభ్యర్థులకు టిక్కెట్​ ఖరారైంది. టిక్కెట్​ కోసం శతవిధాల ప్రయత్నించి..సఫలమైన అభ్యర్థులకు టిక్కెట్​ ఖరారు కావడంతో… ఇక గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నారు.

కర్నూలు బ్యూరో, పల్లెవెలుగు: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బరిలో దింపేందుకు టీడీపీ–జనసేన పార్టీలు పొత్తులో భాగంగా తమ అభ్యర్థుల తొలిజాబితాను  శనివారం విడుదల చేసింది. అందులో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాలకు గాను తొమ్మిది నియోజకవర్గ అభ్యర్థులను ఖరారు చేసింది. దీంతో తెలుగు తమ్ముళ్లలో జోష్​ నింపినట్లయింది.  డోన్​– కోట్ల జయ సూర్య ప్రకాశ్​ రెడ్డి, కర్నూలు– టీజీ భరత్​, పాణ్యం– గౌరు చరితారెడ్డి,  కోడుమూరు – బొగ్గుల దస్తగిరి, పత్తికొండ– కేఈ శ్యాంబాబు, నంద్యాల– ఎన్​​ఎండి ఫరూక్​, ఆళ్లగడ్డ – భూమా అఖిలప్రియ, శ్రీశైలం – బుడ్డా రాజశేఖర్​ రెడ్డి, బనగానపల్లె – బీసీ జనార్ధన్​ రెడ్డిని తొలిజాబితాలో ఎంపిక చేసింది. ఇంకా ఆదోని, ఎమ్మిగనూరు నందికొట్కూరు, , ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

తమ్ముళ్ల.. జోష్​…:

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 8 నియోజకవర్గాలకు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించడంతో ఆయా నియోజకవర్గాల టీడీపీ వర్గాల సంబరాలు చేసుకున్నాయి. టీడీపీ– జనసేన పొత్తులో భాగమైనా తమ నాయకుడికే టిక్కెట్​ వచ్చిందని… ఇక గెలుపు ఖాయమంటూ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణ సంచా పేల్చారు.

ఎన్నికల సమరానికి.. ‘సై’:

ఎన్నికల సమరానికి టీడీపీ–జనసేన పార్టీలుతమ అభ్యర్థులను సిద్ధం చేసింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాలకుగాను 9 అసెంబ్లీ సెగ్మెంట్లకు టిక్కెట్​ ఖరారు చేస్తూ… అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లిన టీజీ భరత్​, కోట్ల సూర్య ప్రకాశ్​ రెడ్డి, గౌరు చరితా రెడ్డి, బొగ్గుల దస్తగిరి, బీసీ జనార్ధన్​ రెడ్డి, బుడ్డా రాజశేఖర్​ రెడ్డి , కేఈ శ్యాం బాబు సునాయాసంగా గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  ఇక నుంచి ప్రచారంలో మరింత దూసుకెళ్లనున్నారు.

అధినేతలకు…కృతజ్ఞతలు..:

రాష్ట్రంలో టీడీపీ–జనసేన పొత్తులో భాగంగా శుక్రవారం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్​ కళ్యాణ్ ఇద్దరు సంయుక్తంగా అభ్యర్థుల తొలిజాబితాను విడుదల చేశారు.  జాబితాలో పేర్లు ఖరారైన అభ్యర్థులు చంద్రబాబు నాయుడుకు, పవన్​ కళ్యాణ్​కు కృతజ్ఞతలు తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు తమదేనంటూ ధీమా వ్యక్తం చేశారు.

అసంతృప్తులకు…బుజ్జగింపులు…:

టీడీపీ టిక్కెట్​ ఆశించి.. భంగపడ్డ  ఆయా నియోజకవర్గాల ఆశావహులకు టీడీపీ అధిష్ఠానం బుజ్జగించే పనిలో పడింది. డోన్​కు సుబ్బారెడ్డి, కోడుమూరుకు ఆకేపోగు ప్రభాకర్​, కిరణ్​మయితోపాటు ఆయా నియోజకవర్గాల్లో టిక్కెట్​ కోసం విశ్వప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో నిరాశకు లోనయ్యారు. ఈ క్రమంలో వారు పక్క పార్టీల వైపు చూడకుండా ముందు నుంచే  అసంతృప్తులకు నచ్చజెప్పేందుకు టీడీపీ అధిష్ఠానం రంగంలోకి దిగింది.

About Author