కొత్త వారికి.. ప్రాధాన్యమేదీ?
1 min readకర్నూలు ఎంపీ సీటుకు .. వైద్యులు క్యూ…
- అవకాశం ఇస్తే… గెలిచి చూపిస్తామంటున్న వైద్యులు
- కొందరు టీడీపీ.. మరికొందరు వైసీపీ టిక్కెట్‌కు ప్రయత్నిస్తున్న వైనం..
- జన,ధన బలం ఉన్న వారికే ప్రాధాన్యమిస్తున్న రాజకీయ పార్టీలు
- ప్రజల నాడి తెలిసినా… నేతల నాడి తెలుసుకోవాలంటున్న పెద్దల పరోక్ష హితవు
- ఒక్క ఛాన్స్ కోసం… ఎదురు చూస్తున్న ప్రముఖ వైద్యులు
కర్నూలు రాజకీయం…ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. ఎప్పుడు.. ఎవరికి… ఏ రూపంలో రాజకీయ తలుపు తడుతుందో అర్థంకాని పరిస్థితి. కొందరు శతవిధాలా ప్రయత్నించినా… రాజకీయాల్లో రాణించలేని దుస్థితి నెలకొంటే… మరికొందరు వారికి తెలియకుండానే రాజకీయ తలుపులు స్వాగతం పలకడాన్ని గమనిస్తూ ఉంటాము. కర్నూలు ఎంపీ టిక్కెట్ కోసం కొందరు వైద్యులు రాజకీయ నేతల ఇళ్లు, కార్యాలయాల చుట్టూ తిరిగినా… ఫలితం లేకపోవడంతో నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. వైసీపీ, టీడీపీ అధినేతల దృష్టి వారిపై పడితే తప్పా… రాజకీయ రంగంలో అడుగు పెట్టే అవకాశం లభించదని భావిస్తున్నారు.
కర్నూలు, పల్లెవెలుగు: ఒకప్పుడు ఫ్యాక్షన్ జోన్‌గా ముద్రపడిన రాయలసీమలో వంశపారంపర్యంగా కొందరు రాజకీయాల్లో రాణిస్తుంటే… మరికొందరు మెరుపు తీగలా వచ్చి… కనుమరుగవుతున్నారు. కాలం మారే కొద్దీ.. శాంతియుత.. ప్రశాంత రాజకీయాలు చోటు చేసుకోవడంతో… వైద్యులు కూడా రాజకీయ రంగంలో రాణిస్తున్నారు. ప్రస్తుతం ఔత్సాహిక వైద్యులు ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలబడేందుకు క్యూ కడుతున్నారు.
రాజకీయ నాడి.. తెలుసుకోలేరా..?
వైద్యరంగంలో ప్రజల నాడి తెలుసుకోవడంలో సిద్ధహస్తులైన వైద్యులు.. రాజకీయ రంగంలో కూడా ప్రజల నాడి తెలుసుకోవడంలో పెద్ద కష్టమేమీ కాదు. ప్రస్తుత కర్నూలు ఎంపీ డా. సంజీవ్ కుమార్ రాజకీయాల్లో రాణిస్తూ… ప్రజలకు ఉత్తమ సేవలు అందించడంలో సఫలీకృతులయ్యారు. రాష్ట్రంలోనూ.. కేంద్రంలోనూ రాజకీయ, ప్రజా సేవకుడిగా గుర్తింపు పొందారు. ఇదే స్ఫూర్తిగా కొందరు వైద్యులు కర్నూలు ఎంపీ టిక్కెట్ ఆశిస్తూ… రాజకీయ నేతలు, పార్టీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
వైద్య సేవకు…బానిస…:
కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో సూపరింటెండెంట్‌గా, మెడికల్ కాలేజి ప్రిన్సిపల్‌గా, సీనియర్ కార్డియాలజి వైద్యులుగా ప్రజలకు విశేష వైద్య సేవలు అందించిన (కర్నూలు హార్ట్ అండ్ బ్రెయిన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత) డా. చంద్రశేఖర్ ఇటీవల రిటైర్డు అయిన విషయం అందరికీ తెలిసిందే. కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిన ఘనత కూడా ఆయనకే దక్కింది. 22 ఏళ్లుగా వైద్య సేవలు అందించి… వేల మందికి ప్రాణదాతగా నిలిచిన సీనియర్ గుండె వైద్య నిపుణులు రిటైర్డు డా. చంద్రశేఖర్…రాష్ట్రంలోనే మంచి గుర్తింపు పొందారు. వైద్య విద్యార్థులకు దిక్సూచిగా మారిన ఆయన.. జూనియర్, సీనియర్ వైద్యులకు ఆదర్శంగా నిలిచారు.
టీడీపీ… ముద్ర….:
వైద్య సేవలతో అశేష ప్రజల గుర్తింపు పొందిన సీనియర్ కార్డియాలజి వైద్య నిపుణులు, హార్ట్ అండ్ బ్రెయిన్ మల్టీ స్పెషాలిటీ అధినేత, రిటైర్డు డా. చంద్రశేఖర్ టీడీపీ కర్నూలు ఎంపీ టిక్కెట్ కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. పదవిలో ఉండగానే టీడీపీ ముద్ర వేసి వేధించారని పేర్కొంటున్న ఆయన… తన అభిప్రాయాన్ని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
ఒక్క ఛాన్స్ కోసం..:
కర్నూలు ఎంపీ టిక్కెట్ కోసం హార్ట్ అండ్ బ్రెయిన్ మల్టీ స్పెషాలిటీ అధినేత, రిటైర్డు డా. చంద్రశేఖర్ తోపాటు అమీలియో ఆస్పత్రి ఎం.డి. డా. లక్ష్మీప్రసాద్ చాపె, రక్ష ఆస్పత్రి ఎం.డి. నాగరాజు కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత నారా చంద్ర బాబు నాయుడు దృష్టికి కర్నూలు ఎంపీ టిక్కెట్ విషయమై ఔత్సాహికుల వైద్యుల జాబితా వెళ్లినట్లు సమాచారం. ధన, ప్రజాబలం ఉన్న వారికే ప్రాధాన్యమిస్తున్న ఆయా రాజకీయ పార్టీలు… కొత్త వారికి ఏమాత్రం ప్రాధాన్యమిస్తాయో.. వేచి చూడాలి.
: