వైసీపీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థిగా ఇంతియాజ్ అహ్మద్ ?
1 min read- సెర్ఫ్ సీఈఓ, సీసీఎల్ఏ సెక్రటరి, మైనార్టీ వెల్ఫేర్ సీఈఓ పదవికి రాజీనామా చేసిన ఐఏఎస్ అధికారి
- అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్న ఐఏఎస్ అధికారి
- కర్నూలు టిక్కెట్‌పై ఉత్కంఠకు తెరదించేనా…?
- ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఇంతియాజ్‌కు సహకరించేనా..?
కర్నూలు, పల్లెవెలుగు: రాయలసీమలో వైసీపీ కర్నూలు అసెంబ్లీ టిక్కెట్‌కు ఉన్న డిమాండ్ మరెక్కడా ఉండదేమో. ఐదేళ్లుగా వర్గవిభేదాలతో మాటల తూటాలు పేల్చుకుంటూ… , నాకంటే… లేదు నాకే టిక్కెట్ అని చెప్పుకునే ప్రస్తుత ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి వైసీపీ అధిష్ఠానం భారీ షాక్ ఇచ్చిందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. వైసీపీ కర్నూలు అసెంబ్లీ టిక్కెట్‌ను ఇంతియాజ్ అహ్మద్ ఐఏఎస్ అధికారికి ఖరారు అయ్యే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు తెలిపాయి. అధిష్ఠానం నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇంతియాస్ అహ్మద్ ప్రభుత్వ సెర్ఫ్ సీఈఓ, సీసీఎల్ఏ సెక్రటరి, మైనార్టీ వెల్ఫేర్ సీఈఓగా విధులు నిర్వహిస్తున్నారు. వైసీపీ అసెంబ్లీ టిక్కెట్ తనకు ఖరారు కానుందని, అందుకే తాను ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం ఆయన తన పదవికి రాజీనామా చేసి, వీఆర్ఎస్లోకి వెళ్లిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన రాజీనామాను ఆమోదించినట్లు తెలిసింది. వైసీపీ అధిష్ఠానం అధికారికంగా వెలువడించే ప్రకటన కోసం ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వర్గాలు ఎదురు చూస్తున్నాయి.
అయోమయం..ఆందోళన…
గత ఐదు నెలలుగా కర్నూలు అసెంబ్లీ టిక్కెట్ తనదంటే…తనదంటూ… ఒకరికొకరు సవాల్ … పంచ్ డైలాగులు విసురుకున్న ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి భారీ ఎదురు దెబ్బ తగిలేటట్లు ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌కు టిక్కెట్ లేదని, ఇలియాస్ బాషకు ఇస్తున్నామని ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఎమ్మెల్యే అనుచరులు కర్నూలు రీజనల్ కో ఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. ఇది జరిగి ఐదు రోజులు కాక ముందే ఇంతియాజ్ అహ్మద్ ఐఏఎస్ అధికారికి కర్నూలు అసెంబ్లీ టిక్కెట్ ఇస్తున్నారని రూమర్లు రావడంతో …అటు ఎస్వీ వర్గం… ఇటు హఫీజ్‌ఖాన్ వర్గం అయోమయంలో పడింది.
సహకరిస్తారా…?
వైసీపీ కర్నూలు అసెంబ్లీ టిక్కెట్ ఇంతియాజ్ అహ్మద్ ఐఏఎస్ అధికారికి ఖరారు అయితే… ప్రస్తుత ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి సహకరిస్తారా… లేదా.. అన్న సందేహం వ్యక్తమవుతోంది. అటు పార్టీ క్యాడర్‌లోనూ గందరగోళం నెలకొనే పరిస్థితి. వైసీపీ పెద్దలు లోకల్ లీడర్లను సంప్రదించి… టిక్కెట్ ఖరారు చేశారా.. లేదా… అనే అనుమానం లేకపోలేదు.