వైసీపీకి గుడ్ బై చెప్పిన కార్పొరేటర్లు, మాజీలు..
1 min readజాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిక
ఆత్మ అభిమానం దెబ్బతినడంతోనే పార్టీని విడనాడం..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలో సైకో సీఎం జగన్ అధర్మ పాలనలో ఇమడలేక, కనీస మర్యాదలు దక్కక ఎంతోమంది వైసిపికి గుడ్ బై చెప్పి టిడిపిలో చేరుతున్నారని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి – జనసేన ఉమ్మడి అభ్యర్ధి బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరు కార్పొరేషన్ 12వ డివిజన్ కార్పొరేటర్ కర్రి శ్రీనివాస్, 30వ డివిజన్ కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వరరావుతో పాటూ మాజీ కార్పొరేటర్లు కౌలూరి చంద్రశేఖర్, మాగంటి హేమ సుందర్, పిలగల ప్రకాష్‌లు అధికార వైసిపికి రాజీనామా చేసి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏలూరు పవర్‌పేటలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏలూరు అసెంబ్లీ అభ్యర్ధి బడేటి చంటి మాట్లాడుతూ ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిన స్టిక్కర్ సీఎం జగన్ హయాంలో ఏ ఒక్క వర్గానికి రక్షణ లేకపోగా, కనీస గౌరవ మర్యాదలు కరువయ్యాయని ఆరోపించారు. ఆయన పెద్ద నియంతైతే, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళ నాని చిన్న నియంతగా వ్యవహరిస్తూ అందరినీ పట్టించుకోవడం మానివేసేరని విమర్శించారు. వైసిపిలో ఆత్మాభిమానం దెబ్బతినడంతో చాలామంది టిడిపి వైపు చూస్తున్నారని, దానిలో భాగంగానే ఇద్దరు కార్పొరేటర్లు, ముగ్గురు మాజీ కార్పొరేటర్లు టిడిపిలో చేరారని చెప్పారు. త్వరలో మరో 18 మంది కార్పొరేటర్లు టిడిపిలోకి రానున్నారని, దాంతో ఏలూరు నియోజకవర్గంలో వైసిపి పూర్తిగా ఖాళీ అవుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం టిడిపి, జనసేన కలయిక జరిగిందని, దానికనుగుణంగానే అందరిని కలుపుకుని ముందుకు సాగుతూ రానున్న ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. కార్పొరేటర్లు కర్రి శ్రీనివాస్, పప్పు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ వైసిపిలో స్థానిక ప్రజాప్రతినిధులకు కనీస గౌరవం కరువైందన్నారు. ఏ యంత్రాగానికి స్వేచ్ఛలేకుండా పోయిందని, చివరకు శాంతిభద్రతలు దారుణంగా తయారయ్యాయన్నారు. ఈ పరిస్థితుల్లో వైసిపిలో ఇమడలేక టిడిపిలో జాయిన్ అయ్యామని, అసెంబ్లీ ఎన్నికల్లో బడేటి చంటిని గెలిపించేందుకు శాయశక్తులా కృషి చేస్తామని చెప్పారు. సమావేశంలో కవులూరి చంద్రశేఖర్, పిలగల ప్రకాష్, మాగంటి హేమసుందర్, ఏలూరు నగర టిడిపి అధ్యక్షులు పెద్దిబోయిన శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.