కర్నూలు అభివృద్ధి కోసం 6 గ్యారెంటీలు.. టిడిపి అభ్యర్థి టి.జి భరత్
1 min readనియోజకవర్గం మొత్తం పర్యటించి సొంతంగా మేనిఫెస్టో రూపొందించిన టి.జి
మౌర్య ఇన్లో నాయకులు, కార్యకర్తల మధ్య మేనిఫోస్టో ఆవిష్కరణ
ఐదేళ్లలో 6 గ్యారెంటీలు అమలుచేయకపోతే రాజకీయాల నుండి తప్పుకుంటానన్న భరత్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించి నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు 6 గ్యారెంటీలతో మేనిఫెస్టో రూపొందించినట్లు కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భరత్ వెల్లడించారు. నగరంలోని మౌర్య ఇన్లో 6 గ్యారెంటీల కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన టిడిపి నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. పదేళ్లపాటు ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకొని ప్రత్యేకంగా ఈ మేనిఫెస్టోను తయారుచేశానన్నారు. కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీ చేయడం, కొత్త పరిశ్రమలు తీసుకురావడం, మహిళలకు భద్రత, ఆర్థిక భరోసా, ప్రతి ఇంటికి సంక్షేమం, అందరికీ ఆరోగ్యం బాగుండాలి అందులో మన కర్నూలు ముందుండాలి, కర్నూలుకు రాష్ట్ర హైకోర్టు బెంచ్ పేరుతో ఆరు గ్యారెంటీలను ఆయన ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాలతో పాటు తన ఆరు గ్యారెంటీలను అమలుచేస్తానన్నారు.6 గ్యారెంటీల అమలుతో అభివృద్ధిలో కర్నూలు ముందంజ
ఈ 6 గ్యారెంటీలను అమలు చేయడం ద్వారా నగరం అభివృద్ధిలో ఎంతో ముందుకెళుతుందని టి.జి భరత్ తెలిపారు. కుల, మత బేధాలు లేకుండా అన్ని వర్గాలకు మేలు జరిగేలా తాను కృషి చేస్తానన్నారు. పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో ప్రతి ఒక్కరికీ అందాలంటే తనలాంటి సరైన నాయకుడు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ శ్రేణులందరూ రానున్న 45 రోజుల పాటు వీటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. తాను గెలిచి తమ ప్రభుత్వం వచ్చాక ఐదేళ్లలో ఈ గ్యారెంటీలు అమలు చేయని పక్షంలో 2029 ఎన్నికల్లో ప్రజలు తనకు ఓటు వేయొద్దని, తానే రాజకీయాల నుండి తప్పుకుంటానని టి.జి భరత్ స్పష్టం చేశారు.ఈ 6 గ్యారెంటీలే నాకు భగవద్గీత, బైబిల్, ఖురాన్తనకు కుల, మత బేధాలు లేవని టి.జి భరత్ తెలిపారు. ఈ ఆరు గ్యారెంటీలే తనకు భగవద్గీత, బైబిల్, ఖురాన్తో సమానమన్నారు. నాయకులు, కార్యకర్తలందరూ సమిష్టిగా కష్టపడితేనే ఫలితం ఉంటుందన్నారు. ప్రత్యర్థులు కేవలం కులంతో రాజకీయం చేస్తారన్నారు. తాము మాత్రం ప్రజాసేవ, అభివృద్ధి అనే మంత్రంతో ప్రజల్లో ఉంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు పొరపాటు చేయకుండా టిడిపికి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, పరిశీలకులు శ్రీనివాసమూర్తి, జనసేన ఇంచార్జి అర్షద్, కార్పోరేటర్లు పరమేష్, జకియా అక్సారీ, కైపా పద్మలతా రెడ్డి, విజయ కుమారి, టిడిపి నేతలు సోమిశెట్టి నవీన్, మన్సూర్ ఆలీఖాన్, అబ్బాస్, సంజీవలక్ష్మి, ముంతాజ్, శివరాజ్, రామాంజనేయులు, రాజ్యలక్ష్మి, మారుతీ శర్మ, బొల్లెద్దుల రామకృష్ణ, గున్నామార్క్, తిమ్మోజీ, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.