ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇవ్వండి.. టిడిపి అభ్యర్థి టి.జి భరత్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భరత్ ప్రజలను కోరారు. నగరంలోని 3వ వార్డు బండిమెట్టలో ఆయన టి.జి భరత్ భరోసా యాత్ర కార్యక్రమం ద్వారా ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిశారు. మరో 40 రోజుల్లో ఎన్నికలు రానున్నాయని.. ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. చంద్రబాబు ముందు చూపుతో రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మార్చే పథకాలు రూపొందించారన్నారు. తాను ఐదేళ్లలో చేసే అభివృద్ధి 20 ఏళ్లపాటు ప్రజలకు మంచి జీవితం ఇస్తుందన్నారు. కర్నూలు ప్రజల సమస్యలు తెలుసుకొని 6 గ్యారెంటీలను తాను సిద్ధం చేశానని తెలిపారు. ప్రజలు తనకు ఓటు వేసి గెలిపిస్తే నిజమైన పాలకుడిగా సేవలు అందిస్తానని హామీ ఇచ్చారు. నగరం మొత్తం ఎన్నో సమస్యలు ఉన్నాయని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే సమస్యలన్నీ తీర్చడంతో పాటు ప్రజల ఆదాయం పెంచేందుకు కృషి చేస్తానన్నారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక కార్యచరణ తయారుచేశానన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు చంద్రబాబుతో మాట్లాడి పరిశ్రమలు తీసుకొస్తానన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు నాగ వీరాంజనేయులు, ఉమామహేశ్వరి, నరేష్, కిరణ్, శ్రీనివాసులు, గౌస్, రమేష్, జీకే రమేష్, మోహన్, అక్బర్, హరి, విజయ్, మధు, నాగరాజు, నవీన్, లాల్, మా భాష, జనసేన కార్యకర్తలు శ్రీనివాస్ రెడ్డి, కిరణ్, విజయ్, తదితరులు పాల్గొన్నారు.
నారా లోకేష్ ను కలిస్తే వ్యాపారం రోడ్డున పడేసారు
నారాలోకేశ్ యువగళం పాదయాత్ర కర్నూల్లో సాగిన సమయంలో ఒక కుటుంబం ఆయన మీద అభిమానంతో ఫోటో దిగినందుకు మరుసటి రోజు వాళ్లకు సంబంధించిన చిన్న కిరాణం బంకును తొలగించారు. ఈ వీధికి ప్రచారానికి వచ్చిన టి.జి భరత్ తో బాధితులు సమస్యను చెప్పుకొని ఆవేదన వ్యక్తంచేశారు. నారా లోకేష్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్తామని భరత్ వారికి చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అర్హత ఉన్నప్పటికీ పింఛన్ తీసేశారని, కారు లేకపోయినా ఉన్నట్లు రికార్డుల్లో ఉందని.. దీంతో పింఛన్ రావడం లేదని మరొక మహిళ చెప్పారు. దీంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయని మహిళ టి.జి భరత్ తో మొరపెట్టుకున్నారు. గత ప్రభుత్వం ఉన్నపుడు ఇంత ధరలు లేవని.. మళ్ళీ టిడిపి రావాలని కోరుకుంటున్నట్లు మహిళ చెప్పారు.