మీడియా కీలక భూమిక పోషించాలి…
1 min readపెయిడ్ న్యూస్, ఫేక్ న్యూస్ నియంత్రించాలి..
పాత్రికేయుల అవగాహనా కార్యక్రమంలో డిపిఓ తూతిక శ్రీనివాస్ విశ్వనాధ్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంలో మీడియా కీలక భూమిక పోషించాలని జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా స్వీప్ కార్యక్రమాల నోడల్ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాధ్ అన్నారు. స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలోని సమావేశపు హాలులో శనివారం ఎన్నికల నిర్వహణలో మీడియా పాత్ర అంశం, ‘పెయిడ్ న్యూస్’ , మీడియా సర్టిఫికేషన్ మరియు మానిటరింగ్ అంశాలపై పాత్రికేయులకు ఏర్పాటుచేసిన అవగాహనా కార్యక్రమంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సవివరంగా వివరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ విశ్వనాధ్ మాట్లాడుతూ జిల్లాలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం నియమ నిబంధనల ననుసరించి ఎన్నికల నిర్వహణను జిల్లా యంత్రాంగం చేపడుతున్నదని, ఇందుకు మీడియా సహకరించాలన్నారు. పెయిడ్ న్యూస్, ఫేక్ న్యూస్ నియంత్రించాల్సిన బాధ్యత మీడియా పై ఉందన్నారు. ఏదైనా సమస్యాత్మకైన వార్తను బ్రేకింగ్ న్యూస్ గా అందించే సమయంలో వార్తలో వాస్తవికతను సంబంధిత అధికారుల వద్ద ధృవీకరించుకున్న అనంతరమే ప్రచురించాలన్నారు. బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎన్నికలు పునాదులు వంటివని, నైతికపరమైన ఓటింగ్ ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతం ఆవుతుందన్నారు. ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా ఓటర్లను చైతన్యపరిచేందుకు జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా నిలిచి, అటువంటి చర్యలకు ప్రచారం ఇవ్వాలన్నారు. పెయిడ్ న్యూస్ కారణంగా ఓటర్లును తప్పుదారి పట్టించడం ద్వారా నైతికపరమైన ఓటింగ్ కు విఘాతం కలుగుతుందని, అలా కాకుండా మీడియా అడ్డుకోవాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఎక్కడైనా ఉల్లంఘన జరిగినట్లు మీడియా దృష్టికి వస్తే వెంటనే సంబంధిత రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. గత ఎన్నికలలో రాష్ట్రంలో సగటున 79. 77 శాతం వోటింగ్ నమోదైతే, జిల్లాలో 83. 79 శాతం వోటింగ్ నమోదైందన్నారు. విద్యావంతులు ఎక్కువగా ఉన్న జిల్లా కేంద్రమైన ఏలూరు నియోజకవర్గంలో కేవలం 68. 10 శాతం మంది మాత్రమే తమ ఓటుహక్కును వినియోగించుకున్నారన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఎన్నికల సంఘం రానున్న ఎన్నికలలో ” ఓటు కన్నా ముఖ్యమైన పనిలేదు.. నా ఓటు హక్కు ను నేను తప్పనిసరిగా వినియోగించుకుంటాను.. ” అనే నినాదంతో వోటింగ్ శాతం 92% పెంచేందుకు చర్యలు చేపట్టిందని, ఈ దిశగా ఓటు హక్కు వినియోగం ప్రాముఖ్యతపై స్వీప్ కార్యక్రమాల ద్వారా ఓటింగ్ శాతాన్ని మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు పార్లమెంట్ స్థానానికి 95 లక్షల రూపాయల వరకు, అసెంబ్లీ స్థానానికి 40 లక్షల రూపాయల వరకు ఎన్నికల నిర్వహణ ఖర్చులను ఎన్నికల సంఘం నియంత్రణ ను విధించిందన్నారు. అంతకు మించి ఖర్చు చేస్తే అభ్యర్థులు అనర్హులు అవుతారన్నారు. తమ గళం వినిపించలేని స్థాయిలో ఉన్న బలహీన వర్గాల తరపున వారి గళాన్ని మీడియా వినిపించాల ని శ్రీనివాస్ విశ్వనాధ్ మీడియా ప్రతినిధులకు పిలుపునిచ్చారు. కుల, మత , భాషా ప్రాతిపదికగా ఓటర్లను ప్రేరేపించడం, ఓట్లను వేయమని అడగడం పూర్తిగా నిషిద్ధమని, అటువంటి వాటిని మీడియా ప్రోత్సహించవద్దని సూచించారు. జిల్లా పౌర సంబంధాధికారి ఆర్.వి.ఎస్. రామచంద్రరావు మాట్లాడుతూ జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు మీడియా భాగస్వామ్యం ఎంతో కీలకమైనదన్నారు. ఎన్నికలకు సంబందించిన సమాచారాన్ని ఎన్నికల మీడియా సెంటర్ ద్వారా పాత్రికేయులకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు ఎలక్ట్రానిక్ మీడియా లో రాజకీయ ప్రకటనలు చేయదలచిన రిజిస్టర్ ఐన రాజకీయ పార్టీలు ప్రతినిధులు ప్రకటన తేదీకి కనీసం 3 రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాలన్నారు. తమ ఎన్నికల రాజకీయ ప్రకటనలను, న్యూస్ చానెల్స్, కేబుల్ నెట్వర్క్స్ ద్వారా, సోషల్ మీడియా, బల్క్ ఎస్.ఎం. ఎస్. లు, వాయిస్ ఎస్.ఎం. ఎస్ లు, తదితర మాధ్యమాల జిల్లా మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ వద్ద తప్పనిసరిగా ఆమోదం పొందిన పిదపే ప్రచురించవలసి ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎం సి ఎం సి కమిటీ సభ్యులు ఎల్. వెంకటేశ్వరరావు, వి. మధుసూర్య ప్రకాష్, వివిధ దినపత్రికలు, న్యూస్ చానెల్స్ కు చెందిన మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.