మసీదులను రాజకీయ వేదికలుగా మార్చొద్దు.. టిడిపి అభ్యర్థి టి.జి భరత్
1 min readతెలుగుదేశం పార్టీలో చేరిన వైసీపీ నాయకులు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్లోని రాజకీయ నాయకులు మసీదులను రాజకీయ వేదికలుగా చేసుకునేందుకు ప్రయత్నిస్తారని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భరత్ అన్నారు. నగరంలోని మౌర్య ఇన్ లో టి.జి భరత్ సమక్షంలో నగరంలోని 5వ వార్డుకు చెందిన వైసీపీ నేత బేగ్ టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీలో కీలక వ్యక్తిగా ఉంటున్న ఈయన తన అనుచరులతో కలిసి టిడిపిలో చేరారు. టి.జి భరత్ వీరికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. బేగ్ రాకతో ఆ ప్రాంతంలో టిడిపి మరింత బలోపేతం అవుతుందని ఈ సందర్భంగా టి.జి భరత్ చెప్పారు. తెలుగుదేశం పార్టీ గెలుపుతో యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. పార్టీలో చేరిన వారంతా రానున్న 40 రోజులు కష్టపడాలని సూచించారు. కర్నూల్లో తాను గెలిచి ఫ్యాక్టరీలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఇక రంజాన్ మాసాన్ని ముస్లింలు సంతోషంగా జరుపుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో పలువురు స్వార్థపరులు మసీదుల్లో రాజకీయాలు చేసే అవకాశం ఉందన్నారు. తమపై నిజాయితీగా గెలవలేని నాయకులు… ముస్లిం పెద్దలు, యువత, మహిళలకు మాయమాటలు చెప్పి ఓట్లు కొల్లగొట్టాలని చూస్తారన్నారు. పవిత్రమైన మసీదులను రాజకీయ వేదికలుగా చేయకూడదన్నారు. ఈ విషయంపై ప్రతి ముస్లిం అప్రమత్తంగా ఉండాలని భరత్ సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన కర్నూలు ఇంఛార్జీ ఆర్షద్, టిడిపి నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.