స్వామినాథన్ కమీషన్ అమలు చేయాలి
1 min readపంటల కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించాలి
రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు బడ్జెట్ లో అత్యధిక నిధులు కేటాయించాలి
బొజ్జా దశరథరామిరెడ్డి డిమాండ్
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: కిసాన్ సంయుక్త మోర్చా ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా రైతులు చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా ఆదివారం ఉదయం నంద్యాల పట్టణం గాంధీ చౌక్ లోని గాంధీ విగ్రహం దగ్గర రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంఘీభావ కార్యక్రమం నిర్వహించిండమైనది. రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయం నుండి ఊరేగింపుగా బయలుదేరి శ్రీనివాసనగర్ సెంటర్ మీదుగా గాంధీ చౌక్ వరకు జరిగిన కార్యక్రమంలో గోస్పాడు, నంద్యాల, బండిఆత్మకూరు, మహానంది, గడివేముల, పాణ్యం మండలాల నుండి రైతు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గాంధి చౌక్ లో మహాత్మా గాంధీకి నివాళులర్పించిన అనంతరం రాయలసీమ సాగునీటి సాధన సమితి నంద్యాల జిల్లా అధ్యక్షులు లాయర్ నాగకృష్ణా రెడ్డి అధ్యక్షతన జరిగిన సంఘీభావ కార్యాక్రమంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ.. వ్యవసాయ ఉత్పాదన ఖర్చుకు యాభై శాతం అదనంగా కనీస మద్దతు ధరను చట్టబద్దంగా ప్రకటిస్తామని 2014 ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచి భారతీయ జనతా పార్టీ అధికారంలోనికి వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అధికారంలోనికి వచ్చిన తర్వాత, కనీస మద్దతు ధరకు చట్టబద్దత ప్రకటించడం అటుంచి, రైతుల నడ్డి విరిచే మూడు రైతు చట్టాలను కరోనా సమయంలో తీసుకొనివచ్చిన విషయం ప్రస్తావించారు. ఈ చట్టాలను తొలగించాలని ఏడాది పైగా డిల్లీ కేంద్రంగా పంజాబ్, హర్యానా రైతుల ఉద్యమంలో సుమారు ఎనిమిది వందల మంది ప్రాణాలు కోల్పొయిన తరువాత, ప్రభుత్వం దిగివచ్చి ఈ చట్టాలను రద్దు చేస్తూ, కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పిస్తామని ప్రకటించిన విషయం అందరికి తెలిసిందేనని పేర్కొన్నారు.ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని చలో ఢిల్లీ కి పిలుపు నిచ్చిన పంజాబ్ రైతులను, హర్యానా సరి హద్దులలో నిలువరించి వారిపై డ్రోన్లతో, ప్లాస్టిక్ బుల్లెట్లతో దాడి చేసి ఒక యువ రైతు మరణానికి, అనేక మంది రైతులు గాయాలపాలు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని, డాక్టర్ స్వామినాథన్ కమీషన్ నివేదికను అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చెందిన ఆంధ్ర ప్రదేశ్ లోని ఇతర ప్రాంతాలతో రాయలసీమ సాగునీటి నిర్మాణాలలో సమానాభివృద్ధికి నిదుల కేటాయింపులు చేపట్టాలని ఈ సందర్భంగా వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రైతు నాయకులు బెక్కం కృష్ణా రెడ్డి, చిన్న రామకృష్ణా రెడ్డి, శంకర రావు, ఈశ్వర రెడ్డి, రామ సుబ్బా రెడ్డి, కాసిం, భూసి రెడ్డి, సదాశివా రెడ్డి, యుగంధర్ రెడ్డి, ప్రజా సంఘాల నాయకులు అడ్వకేట్ శంకరయ్య, షఫీ, పాండే, షణ్ముఖ, రాయలసాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు వై ఎన్ రెడ్డి, ఏర్వ రామచంద్రారెడ్డి, కార్యదర్శి మహేశ్వర రెడ్డి, ప్రజా సంబంధాల కార్యదర్శి సుధాకర్, కార్య నిర్వాహక సభ్యులు శ్రీహరి, పర్వేజ్, భాస్కర రెడ్డి, సౌదాగర్ ఖాసిం మియా తదితరులు పాల్గొన్నారు.