శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ని దర్శించుకున్న వేలాదిమంది భక్తులు
1 min readస్వామివారిని దర్శించుకున్న నగర ప్రముఖులు, శేష వస్త్రం తీర్థప్రసాదాలు అందజేత
ప్రత్యేక అలంకారంతో స్వామివారు దర్శనం
వివిధ సేవల రూపేణ రూ:1,22,955/-లు ఆదాయం
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : జంగారెడ్డిగూడెం మండలము, గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి దర్శనార్ధము మంగళవారం సందర్భముగా వేలాది మంది భక్తులు బారులుతీరి దర్శించుకున్నారు. తెల్లవారుఝామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాతసేవ, నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు నిర్వహించారు. భక్తులు శ్రీస్వామి వారి ఆలయము చుట్టూ 108 ప్రదక్షణలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులచే అన్నప్రాసనలు, వాహన పూజలను జరిపించుకున్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారి కె. అద్దయ్య, జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం నూతన కమిషనరు నరేంద్ర స్వామివారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. పూజ అనంతరం వారికి కార్యనిర్వహణాధికారి స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు అందజేశారు. మద్యాహ్నం వరకు దేవస్థానమునకు వివిధ సేవల రూపేణ రూ.1,22,955/- లు సమకూరినది. సుమారు 1500 మంది భక్తులకు స్వామి వారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు. శ్రీస్వామివారి దర్శనముంకు విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా ఆలయ పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు గావించినట్లు ధర్మకర్తల మండలి అద్యక్షురాలు సరిత విజయభాస్కర్ రెడ్డి, కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు.