రక్తం గ్రూపు కలవకపోయినా కిడ్నీ మార్పిడి!
1 min read* విశాఖపట్నంలోనూ ఈ తరహా శస్త్రచికిత్సలు
* పెద్ద నగరాలకు వెళ్లాల్సిన అవసరం ఇక లేదు
* మార్పిడి కంటే వ్యాధి నివారణ సులభం.. ముఖ్యం
* కిమ్స్ ఐకాన్ ఆస్పత్రి వైద్యుల సూచన
* నేడు ప్రపంచ కిడ్నీ దినోత్సవం
పల్లెవెలుగు వెబ్ విశాఖపట్నం : సాధారణంగా కిడ్నీ మార్పిడి చేయాలంటే సమీప బంధువుల నుంచి తీసుకోవాలి, అది కూడా ఒకే రక్తం గ్రూపు అయి ఉండాలి. లేదంటే ఎవరైనా జీవన్మృతులు అవయవదానం చేస్తే వారి నుంచి తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఈ రెండు మార్గాలూ కుదరవు. సమీప బంధువులు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నా రక్తం గ్రూపు మ్యాచ్ కాదు. అవయవదానానికి చాలా ఎక్కువ కాలం వేచిచూడాలి. ఇలాంటి సందర్భాల్లో వేర్వేరు రక్తం గ్రూపులు ఉన్నవారి మధ్య సైతం కిడ్నీ మార్పిడి జరుగుతోంది. గతంలో కేవలం పెద్ద పెద్ద నగరాల్లో మాత్రమే చేసే ఈ తరహా శస్త్రచికిత్సలు ఇటీవలి కాలంలో విశాఖపట్నంలోనూ చేస్తున్నారు. నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో ఈ తరహా శస్త్రచికిత్సలు విజయవంతంగా చేస్తున్నట్లు ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ నెఫ్రాలజిస్టు డాక్టర్ ఆర్.కె. మహేష్ తెలిపారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. “రక్తం గ్రూపులు వేర్వేరుగా ఉన్నప్పుడు సాధారణంగా మనం రక్తం ఎక్కిస్తేనే ఇన్ఫెక్షన్లు వచ్చి, రియాక్షన్లు మొదలవుతాయి. అలాంటిది ఏకంగా కిడ్నీయే అమర్చడం అంటే చిన్న విషయం కాదు. అందుకోసం ముందుగా గ్రహీతలకు రక్తం గ్రూపు వేరే అయినా దుష్ప్రభావాలు రాకుండా ఉండేలా కొన్ని రకాల మందులు ఇస్తాం. అవి వాడి, వాళ్ల శరీరం కిడ్నీ మార్పిడికి సిద్ధంగా ఉందని అనుకున్నప్పుడు అప్పుడు వాళ్ల సమీప బంధువులలోంచి వేరే గ్రూపు రక్తం ఉన్నవారి కిడ్నీ తీసి అమరుస్తాం. ఒకప్పుడు ఈ తరహా శస్త్రచికిత్సలు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, రాయవెల్లూరు లాంటి పెద్ద పెద్ద నగరాలు, ఆస్పత్రులలో మాత్రమే జరిగేవి. ఇప్పుడు విశాఖపట్నంలోనూ విజయవంతంగా వీటిని చేస్తున్నాం. ఒక్క కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలోనే ఈ తరహా శస్త్రచికిత్సలు ఇప్పటికి పది పైగా వరకు చేశాం. అన్నింటిలోనూ రోగులు పూర్తిగా కోలుకుని సాధారణ జీవితం గడుపుతున్నారు. దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు (సీకేడీ) లాంటి సమస్యలు ఒక్క రోజులో రావు. చాలాకాలం నుంచి ఉండి, అవి తీవ్రతరం అయిన తర్వాత వస్తుంటారు. అప్పుడు కొన్నాళ్ల పాటు డయాలసిస్ చేసినా, కిడ్నీ మార్పిడి తప్పనిసరి అవుతుంది. కానీ నిజానికి ఎవరైనా కిడ్నీలకు సంబంధించిన సమస్య వచ్చినప్పుడు ముందుగా గుర్తించి కొన్ని మందులు వాడటం, జీవనశైలిలో మార్పులు చేసుకుంటే మార్పిడి వరకు వెళ్లాల్సిన అవసరమే ఉండదు. నొప్పినివారణ మందులు ఎక్కువగా వాడటం, జిమ్‌లో కండలు తిరిగేందుకు ఎక్కువ వ్యాయామాలు చేయడం, అధిక ప్రోటీన్లు, అధిక కేలరీలు ఉన్న ఆహారాలు తీసుకోవడం, రోజువారీ ఆహారంలో ఉప్పు ఎక్కువగా వాడటం లాంటి వాటి వల్ల కిడ్నీలు దెబ్బతింటాయి. ప్రతిరోజూ నీళ్లు కూడా తగినంతగా తాగాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటించనివారికి కిడ్నీలకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. వాటి లక్షణాలను గమనించి, తొలిదశలోనే వైద్యులను సంప్రదిస్తే చాలావరకు తగ్గిపోతుంది. మార్పిడి వరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. విశాఖపట్నంలోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రి కి తూర్పుగోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల రోగులు వస్తుంటారు. అందులోనూ శ్రీకాకుళంలోని ఉద్దానం ప్రాంతానికి చెందిన వారు కూడా ఇక్కడకు వస్తారు. నగరంలో చేసే మొత్తం కిడ్నీ మార్పిడులలో దాదాపు సగం వరకు ఆరోగ్యశ్రీ, సీజీహెచ్ఎస్, ఇతర కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల బీమా పథకాలు తదితరవాటిలో ఉచితంగా చేసేవే ఉంటాయి. ఏదైనా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కంటే ముందుగా జాగ్రత్త పడటం మంచిది కాబట్టి ఎవరికి వారు తమ చేతుల్లో ఉన్న ఆరోగ్య సంరక్షణ విషయంపై దృష్టిపెట్టాలి” అని డాక్టర్ ఆర్.కె. మహేష్ సూచించారు.