కర్నూలు అభివృద్ధికి..అవకాశమివ్వండి..
1 min readఆశీర్వదించి… గెలిపించండి..
- కర్నూలు అసెంబ్లీ బరిలో జెఎస్ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షులు ఏపీ రామయ్య యాదవ్
పల్లెవెలుగు, కర్నూలు: కుల మతాలు లేని సమ సమాజ స్థాపనకే జాతీయ సమసమాజం పార్టీ ఆవిర్భవించిందని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఏపీ రామయ్య యాదవ్ స్పష్టం చేశారు. సమాజ హితం కోసం తన పార్టీని గెలిపించి, కుటుంబ పార్టీల పాలనకు చరమగీతం పాడాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం ఆ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఏపీ రామయ్య యాదవ్ కర్నూలు ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే తాను కర్నూలు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని తెలిపారు. పరిశ్రమలు కాపాడుకోవడం కోసం రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులను కాకుండా ప్రజాసేవ కోసం వచ్చిన తనలాంటి వ్యక్తులను ప్రజలు ఎన్నికల్లో ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.
గెలిపిస్తే… సమస్యలన్నీ పరిష్కరిస్తా…:
తనను కర్నూలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజల తాగు నీటి సమస్య పరిష్కరించేందుకు 2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల నిర్మాణంతోపాటు నూతన తాగునీటి కొళాయి పైపులను నగరమంతా ఏర్పాటు చేసి, ప్రజలందరికీ త్రాగునీరు సరఫరా చేస్తానని హామీ ఇచ్చారు. అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థను గాడిన పెట్టేందుకు నగరంలో అండర్గ్రౌండ్ డ్రైనేజీని నిర్మిస్తానని తెలిపారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశ కల్పించేందుకు పరిశ్రమలను ఏర్పాటు చేయిస్తానని అన్నారు. పాత బస్తీలో ఇరుకు సందుల్లో శిథిలమవుతున్న విద్యుత్ స్తంభాలను బాగు చేస్తానని చెప్పారు. అర్హులైన పేదలందరికీ పింఛన్లు ఇప్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు.
అనాథలకు… ఆశ్రమాలు…:
కర్నూల్ నగరంలోని దిక్కుమొక్కు లేని వారు ,వృద్ధులు, అనాధల కోసం ప్రభుత్వం లేదా స్వచ్ఛంద సంస్థలతో ఉచితంగా అనాధ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. పగలంతా పనిచేసి వచ్చిన కార్మిక వర్గాల కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో సాయంత్రం పూట ప్రత్యేక ఓపి ఏర్పాటు చేయించి, ప్రత్యేకంగా వైద్యులు ఉండేలా చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. డబ్బున్న వారే రాజకీయాల్లో ఏలాలన్న భావన నుండి ,సామాన్యుడు కూడా ఎన్నికల్లో పోటీ చేసి, రాజకీయాల్లో రాణించవచ్చనే విధంగా ప్రజల్లో మార్పు తీసుకొస్తానని ఏపీ రామయ్య యాదవ్ దీమా వ్యక్తం చేశారు. ధన బలంతో ఎన్నికల్లో పోటీ చేసి రాజకీయాలు నడుపుతున్న వారికి బుద్ధి చెప్పేందుకే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానన్నారు. కర్నూలు ప్రజలందరూ తనకు ఓటు వేసి గెలిపిస్తే, సమ సమాజ నిర్మాణానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఏపీ రామయ్య యాదవ్ కర్నూలు నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. సమావేశంలో జాతీయ సమసమాజ పార్టీ గౌరవాధ్యక్షులు డా.బాలమద్దయ్య తదితరులు పాల్గొన్నారు.