వైసీపీ నేతల గాలి మాటలు బిసిలు నమ్మొద్దు..
1 min readకర్నూలు టిడిపి అభ్యర్థి టిజి భరత్
బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువస్తాం: టీజీ భరత్
పెద్దపడఖానా జయహో బీసీ సభలో పాల్గొన్న భరత్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తాము 40 ఏళ్లుగా రాజకీయాలకు అతీతంగా కర్నూల్ ప్రజలకు సేవ చేస్తున్నామని.. గత 20 రోజుల ముందు వచ్చి ప్రజలకు సేవ చేస్తాం, ఓటేయండి అనే వ్యక్తిని నమ్మకండని కర్నూల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ ప్రజలను కోరారు. కర్నూలు నగరంలో పెద్దపడఖానాలో నిర్వహించిన జయహో బీసీ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ.. పదేళ్ల నుంచి తమ కుటుంబం అధికారంలో లేకపోయినా ప్రజా సేవను మరువలేదన్నారు. తమ ప్రత్యర్థి స్థానికేతరుడని.. ఎన్నికల్లో ఓడిపోతే ఆయన ఊరు విడిచి వెళ్లిపోతారని అన్నారు. అయితే తాము గెలిచినా.. ఓడినా కర్నూలు ప్రజలకు ఎల్లప్పుడు అండగా ఉంటున్నామన్నారు. కర్నూలులో ఇప్పుడే నీటి కష్టాలు మొదలయ్యాయని.. భవిష్యత్ నీటి కష్టాలను దృష్టిలో పెట్టుకుని తన తండ్రి టీజీ వెంకటేశ్ 2014 ఎన్నికలకు ముందు చెక్ డ్యామ్ నిర్మించాలని జీవో తీసుకువచ్చారని గుర్తు చేశారు. అయితే ఆయన ఓడిపోయిన తరువాత వచ్చిన పాలకులు ఆ జీవోను పక్కన పెట్టేశారని తెలిపారు. ప్రజలు నిజంగా సేవ చేసే వాళ్లను గుర్తించాలని కోరారు. బీసీల డీఎన్‌ఏలో టీడీపీ ఉందన్నారు. చంద్రబాబు నాయుడు బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురానున్నారని తెలిపారు. బీసీ ఉప ప్రణాళిక అమలులో భాగంగా.. ఏడాదికి రూ.30 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. ఈ ప్రభుత్వంలో బీసీలు ఎంతో నష్టపోయారని అన్నారు. వైసీపీ నేతలు చెప్పే గాలి మాటలకు ఈసారి మోసపోకుండా.. రానున్న ఎన్నికల్లో టీడీపీని భారీ మెజార్టీ గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పరమేశ్, కర్నూల్ పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షుడు సత్రం రామకృష్ణుడు, బిసి సెల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సంజీవ లక్ష్మీ, తిరుపాల్ బాబు, విజయ లక్ష్మీ, శ్రీనివాసులు, బాలు, సూర్యనారయణ తదితరులు పాల్గొన్నారు.