త్రాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు..జిల్లా కలెక్టర్
1 min readత్రాగునీరు సరఫరా అయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి
ఎంపీడీవోలు తదితర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
చలివేంద్రాలకు చర్యలు తీసుకోవాలి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : త్రాగునీటి ఎద్దడిలేకుండా ప్రజలకు త్రాగునీరు సరఫరా అయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్నవెంకటేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్ధానిక కలెక్టరేట్ నుంచి శనివారం ఎంపిడివోలు తదితరులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో త్రాగునీటి ఎద్దటి నివారణ, ఉపాధిహామీ తదితర అంశాలపై తీసుకోవల్సిన జాగ్రత్తలపై కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ దిశా నిర్ధేశం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడా త్రాగునీటి ఇబ్బంది వుందో అధికారులు ముందుగానే తెలుసుకోని సమస్యను పరిష్కరించాలన్నారు. నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు యుద్ధప్రాతిపధికన అత్యవసర మరమ్మత్తులు చేసేందుకు మండల పరిషత్ నిధులు వినియోగించుకోవాలన్నారు. ఎక్కడా త్రాగునీటి సమస్య ఉత్పన్నంకాకుండా సంబంధిత అధికారులు తగు చర్యలుతీసుకోవాలన్నారు. వేసవి నేపద్యంలో వేడిగాలులు వీచే పరిస్ధితులు ఉన్నందున అందుకు తగు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. ఎటువంటి ప్రచారాలకు తావులేని రీతిలో చలివేంద్రాలకు ఏర్పాటు చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధిహామీ పనులను మధ్యాహ్నం లోపుగానే పూర్తిచేసుకునేలా ప్రణాళిక అమలు చేయాలన్నారు. ఉపాధిపనులు జరిగే ప్రాంతాల్లో సేదతీర్చుకునేందుకు కార్మికులకు నీడ కల్పించే సౌకర్యం కల్పించాలన్నారు. సమావేశంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ టి. శ్రీపూజ, జిల్లా రెవిన్యూ అధికారి డి. పుష్పమణి, జెడ్పి సిఇఓ కె.ఎస్.ఎస్.సుబ్బారావు, డిఆర్డిఏ పిడి డా. ఆర్. విజయరాజు, డ్వామా పిడి ఎ. రాము, ఏలూరు ఆర్డిఓ ఎన్ఎస్ కె. ఖాజావలి, తదితరులు పాల్గొన్నారు.