సీఏఏ పై వైసీపీది అసత్య ప్రచారం
1 min readరాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు
ముస్లిం మైనారిటీలు వైసీపీ తప్పుడు ప్రచారం నమ్మవద్దు
ముస్లిం మైనారిటీలకు సీఏఏ తో ఎలాంటి హానీ లేదు
టీడీపీతోనే ముస్లిం మైనార్టీల సంక్షేమం సాధ్యం
టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: పౌరసత్వ సవరణ చట్టం ( సీఏఏ)పై ముస్లిం మైనారిటీ వర్గాల్లో భయాందోళనలు సృష్టించేందుకు వైసీపీ 420 బ్యాచ్ నాయకులు మసీదు లలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శనివారం నందికొట్కూరు పట్టణంలోని ఆయన స్వగృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారం ఆపాలని సీఏఏ వలన ముస్లిం మైనారిటీలకు ఎలాంటి హానీ జరగదని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి గొడవలు సృష్టించేందుకే వైసీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. సీఏఏ బిల్లుకు మద్దతు తెలిపినది వైసీపీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. నాడు మద్దతు తెలిపి నేడు మీ స్వార్ధ రాజకీయాల కోసం రాష్ట్రంలో మత విద్వేషాలు సృష్టించి లబ్ధి పొందాలని చూడడం సిగ్గుమాలిన చర్య కాదా అని ప్రశ్నించారు.ముస్లిం ల ప్రార్థన మందిరాలకు వెళ్ళి నీచమైన రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. సీఏఏ అమలు తర్వాత ముస్లింలను దేశం నుంచి తరిమివేస్తారని వైసీపీ ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు . పాకిస్తాన్, అఫ్గాన్, బంగ్లాదేశ్లోని హిందూ, క్రిస్టియన్, సిక్కు, పార్సీలు హింసకు గురవుతున్నారు. వారికి పునరావాసం కల్పించడం మన నైతిక బాధ్యత కాదా ప్రశ్నించారు. ముస్లిం మైనారిటీలకు టీడీపీ హయాంలోనే లబ్ది చేకూరిందని అన్నారు.మైనార్టీల కోసం టీడీపీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు.రాష్ట్రంలో ముస్లింల అభివృద్ధి సంక్షేమం టీడీపీ తోనే సాధ్యమన్నారు. వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం మానుకోవాలని లేని పక్షంలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ముస్లిం మైనారిటీలను భయబ్రాంతులకు గురి చేయడం మానుకోవాలని హితవు పలికారు.కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.