దశాబ్దాలుగా క్రీడలను ప్రోత్సహిస్తున్నాం..: టీజీ భరత్
1 min readఎన్నికల్లో నన్ను ఆశీర్వదించండి…
- కర్నూలు జిల్లా క్రీడా సంఘాల ప్రతినిధులతో టి.జి భరత్ విన్నపం
కర్నూలు, పల్లెవెలుగు:రాజకీయాలతో సంబంధం లేకుండా దశాబ్దాలుగా క్రీడలను తాము ప్రోత్సహిస్తున్నామని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భరత్ చెప్పారు. నగరంలోని మౌర్య ఇన్లోని ఆయన కార్యాలయంలో కర్నూలు జిల్లా క్రీడా సంఘాల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. నగరంలో క్రీడలకు తాము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామన్నారు. తన తండ్రి టి.జి వెంకటేష్ రాజకీయాల్లోకి రాకముందు నుండే క్రీడలకు సహకారం అందిస్తూ వచ్చారన్నారు. రాజకీయ రంగప్రవేశం చేసిన తర్వాత తమ టిజివి సంస్థలతో పాటు ప్రభుత్వ పరంగా క్రీడారంగం అభివృద్ధి, క్రీడాకారులకు చేయూతనిచ్చేందుకు పెద్దపీట వేశారని తెలిపారు. ఇప్పుడున్న నాయకులు చేసింది గోరంతయితే చెప్పుకునేది కొండతగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ఎన్నికల్లో మంచి చేసే తమకు మద్దతు ఇవ్వాలని టి.జి భరత్ వారిని కోరారు. ఓట్ల కోసం నెల రోజులుగా ప్రజలతో తిరుగుతున్న నాయకులను నమ్మొద్దన్నారు. 40 ఏళ్లుగా కర్నూల్లోనే ఉంటూ నిత్యం ప్రజాసేవలోనే ఉంటున్నట్లు భరత్ పేర్కొన్నారు. క్రీడాకారులను కలిసి ఓట్ల కోసం రాజకీయాలు చేసే స్వార్థపరులకు మద్దతు ఇవ్వొద్దన్నారు. ఎలాంటి సహాయం కావాలన్నా ముందుండి అండగా ఉంటున్న తమను ప్రోత్సహిస్తే పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఆర్చరీ, హ్యాండ్ బాల్, వెయిట్ లిఫ్టింగ్, రగ్బీ, పవర్ లిఫ్టింగ్, టేబుల్ టెన్నిస్ హాకీ, ఫుట్బాల్, రైఫిల్ షూటింగ్, సైకిల్ పోలో, యోగ, షూటింగ్ బాల్, నెట్ బాల్, సాఫ్ట్ టెన్నిస్, సాఫ్ట్ బాల్, శిలంబం, స్క్వేర్ మార్షల్ ఆర్ట్స్, బిలియర్డ్స్, బాడీ బిల్డింగ్, ప్రైవేటు పి.ఈ.టిల సంఘం, ఉషు, కరాటే, కిక్ బాక్సింగ్, ఒలింపిక్ అసోసియేషన్, టేబుల్ టెన్నిస్, టెన్నిస్, టైక్వాండో, సాఫ్ట్ టెన్నిస్, అథ్లెటిక్స్, సైకిల్ పోలో, షూటింగ్ బాల్, చౌక్ బాల్, తదితర అసోసియేషన్ ప్రతినిధులు హాజరై టీజీ భరత్ కు మద్దతు పలికారు.