అడ్డాల్లో చలివేంద్రాలు… చలువ పందిళ్ళు ఏర్పాటు చేయాలి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ నగరంలోని భవన నిర్మాణ కార్మికుల అడ్డాల్లో చలివేంద్రాలు, చలువ పందిళ్ళు ఏర్పాటు చేయాలని ఏపీ భవన మరియు ఇతర నిర్మాణ రంగ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్డి కాజా పాషా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక సుర్జిత్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ .డి. ఖాజా పాషా మాట్లాడుతూ భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నుండి భవన నిర్మాణ కార్మికుల అడ్డాలో అవసరమైతే మజ్జిగ కూడా సరఫరా చేయాలన్నారు.రోజు రోజుకు వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో అడ్డాల్లో కనీస వసతులు ఏర్పాటు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. జగన్ ప్రభుత్వం లో కార్మికులకు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని అన్నారు. జగన్ ప్రభుత్వంలో భవన నిర్మాణ కార్మికులకుఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయలేదన్నారు కాగా వీరి సంక్షేమం నిధి 875 కోట్లు రాత్రికి రాత్రి గజదొంగల డబ్బులు కాజేశారని మండిపడ్డారు. రావాలి జగన్ కావాలి జగన్ అని గెలిపించుకుంటే భవన నిర్మాణ కార్మికులకు మొండి చూపించారని వాపోయారు. పోవాలి జగన్ రావాలి సంక్షేమ పథకాలన్నీఅనే నినాదంతో ద్రోహం చేసిన జగన్కు రాజకీయ సమాధి కట్టాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నగర నాయకులు ఎస్ .మూస, సయ్యద్ బాబు, ఎస్. జావీద్, ఆర్షద్ భాష పాల్గొన్నారు.