వడదెబ్బ ప్రాణంతకం…ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
1 min readఅన్ని పంచాయతీ, పట్టణాలలో చలివేంద్రాలు ఏర్పాటు చెయ్యాలని ఆదేశాలు జారీ
వేసవి తీవ్రత అధికంగా ఉన్నందున ప్రజలకు అందుబాటులో సిబ్బంది ఉండాలి
జిల్లా కంట్రోల్ రూమ్ ఏర్పాటు, సమాచారం కోసం 9491041422, 9849903321 నెంబర్లుకి సంప్రదించవచ్చు
జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున వడదెబ్బ తగలచ్చని ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ సూచించారు.జిల్లాలో ఉన్న కమీషనర్లకు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు చరవాణి ద్వారా ఆదేశాలు జారీచేస్తూ ప్రజలకు, మూగజీవులకు తగినంత త్రాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయాలలో, పట్టణ కార్యాలయాలలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలిని, తప్పనిసరిగా తగినన్ని ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. పట్టణాలలో, గ్రామాలలో నిఘా పెంచి ఆసుపత్రిలలో, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో నమోదైన పేషెంట్స్ స్థితిగతులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రజలకు వడదెబ్బ ఉపశమన సహకారం అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు. ప్రతి పట్టణాలలో,గ్రామ సచివాలయాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలనీ కమిషనర్లకు, ఎంపీడీఓలకు సూచించారు. ఎండ తీవ్రతకు వడదెబ్బ తగిలితే ప్రాణాపాయం జరగవచ్చని అందుకే ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సూచించారు. సాధ్యమైనంత వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో మధ్యాహ్నం గం 11ల నుంచి సాయంత్రం గం 3ల వరకు ప్రజలు ఎవ్వరు బైటకు రాకూడదని సూచించారు. తప్పనిసరిగా పరిస్థితిలో బైటకు వెళ్ళవలసి వస్తే కాటన్ దుస్తులు ధరించాలని అలాగే గొడుగులు వాడాలని, తలకు టోపీలు ధరించాలని అన్నారు. ఎట్టిపరిస్థితుల్లో నల్ల దుస్తులు వాడకూడన్నారు. పిల్లలు, వృద్దులు కుటుంబ సభ్యుల సహకారంతోనే బైటకు వెళ్లాలని వారితో తప్పనిసరిగా త్రాగునీరు తీసుకెళ్లాలని సూచించారు. చలవ కళ్లద్దాలు వాడితే మంచిదని మంచిదని, ఎట్టిపరిస్థితిలో శరీరాన్ని నిర్జలీకరణం (డిహైడరేషన్) చేసే కారకాలైన మద్యం, తేనీరు, కాఫీ, కార్బోనేటెడ్ పానీయలు సేవించకూడదని సూచించారు. సాధ్యమైనంత ఎక్కువ ప్రతి ఒక్కరు మజ్జిగ, బార్లీ, త్రాగునీరు తీసుకువాలని, వీలైనంత వరకు ఇంటిఆవరణలో చలువ పందిళ్ళు వేసి ఎండ తీవ్రతనుంచి రక్షించు కోవాలని సూచించారు. ప్రోటీన్లు ఎక్కువ ఉన్న ఆహారం, నిలవ ఆహారం తీసుకోవద్దని అన్నారు. పిల్లలను, పెంపుడు జంతువులను వాహనాలు పార్కు చేసే ప్రాంతాలలో ఉంచకూడదని అన్నారు. వడదెబ్బ ప్రాణంతకమైనందున వడదెబ్బ తగిలినట్టు ఎవరికైనా అనుమానం ఉంటే చల్లని ప్రదేశంలో సేదతీరాలని ఆలస్యం చేయకుండా మెరుగైన వైద్యం కోసం దగ్గిరలో ఉన్న వైద్యుని సంప్రదించాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సూచించారు. అలాగే ప్రజల సహాయార్ధం జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, సమాచారం కోసం, సహాయర్ధం జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా గ్రామ పంచాయతీ అధికారిని 94910 41422, 9849903321 నెంబర్లులో సంప్రదించవచ్చని అన్నారు.