మేము.. ముస్లింలకు అన్యాయం చేయలేదు..
1 min readకుల, మత రాజకీయాలు చేసే వారిని నమ్మొద్దు
- టీడీపీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి టీజీ భరత్
- ఈడెన్ గార్డెన్స్ లో ఇఫ్తార్ విందులో పాల్గొన్న టి.జి భరత్
- టీజీ భరత్‌ను గెలిపించుకుందా: ముస్లిం నేతలు
కర్నూలు, పల్లెవెలుగు:రానున్న ఎన్నికల్లో ఓటు హక్కును సరిగ్గా వాడుకోకపోతే మరో ఐదేళ్లు నష్టపోతామని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని కేవీఆర్ గార్డెన్‌లో ఉన్న సూపర్ ఫంక్షన్ హాల్‌లో 10, 11 వార్డులకు సంబంధించిన ముస్లింలకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. తాము 40 ఏళ్లుగా ప్రజా సేవ చేస్తున్నామని.. ఇంతవరకు ఏ ఒక్క ముస్లిం కుటుంబానికి అన్యాయం చేసింది లేదన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమికి ఓటు వేస్తే ముస్లింలకు అన్యాయం జరుగుతుందని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళుతున్నామన్నారు. పార్లమెంట్‌లో సీఎఎ, ఎన్‌ఆర్‌సీ బిల్లులకు వైఎస్సార్సీపీ పూర్తి మద్దతు తెలిపిందని గుర్తు చేశారు. ఒక చేయి ఎత్తి మద్దతు తెలపమంటే.. ఏకంగా రెండు చేతులు ఎత్తి మద్దతు తెలిపిన ఘనత వైఎస్సార్సీపీకి దక్కిందన్నారు. 2014-19 వరకు ఉన్న టీడీపీ, బీజేపీ ప్రభుత్వంలో ఏ ఒక్క ముస్లిం, క్రిస్టియన్ కుటుంబానికి అన్యాయం జరిగిందా..? అని ఆయన ప్రశ్నించారు. తమ ప్రభుత్వంలోనే రంజాన్ తోఫా, షాదీ ముబారక్, విదేశీ విద్య వంటి మంచి సంక్షేమ పథకాలను ముస్లింల కోసం అందజేసినట్లు గుర్తు చేశారు. మరోసారి ఈ వైసీపీ ప్రభుత్వం వస్తే బానిస బతుకులే ఉంటాయని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. ఇక వైసీపీ అభ్యర్థి నాన్ లోకల్ అని.. ఓడిపోతే ప్యాకప్ చేసుకుని వెళ్లిపోతాడన్నారు. తాను గెలిస్తే కర్నూలును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని.. ఆరు గ్యారంటీలు అమలుచేసి ప్రజలందరీ ఆదాయం పెంచుతానని చెప్పారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు. తాము కష్టపడే వాళ్లమని అందుకే సైకిల్ గుర్తు వచ్చిందని.. గాలి మాటలు చెబుతున్నందుకే వైసీపీకి అల్లా ఫ్యాన్ గుర్తు వచ్చేలా చేశారన్నారు.
టీజీ భరత్‌ను గెలిపించుకుందా: ముస్లిం నేతలు
ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు వస్తాయని.. అదే ఐదేళ్లకు ఒకసారి టీజీ కుటుంబం పోటీలో ఉన్నప్పుడు కులం, మతం తీసుకువచ్చి మత రాజకీయాలు చేస్తారని టీడీపీ మైనార్టీ నేతలు స్థానిక ప్రజలకు వివరించారు. కేవలం ప్రజా సేవ కోసమే టీజీ కుటుంబం రాజకీయాల్లో ఉందన్న విషయం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు. అధికారం లేకపోయినా ప్రజలకు మంచి చేస్తున్న వీళ్లను గెలిపిస్తే.. ఎన్నో కుటుంబాలకు చేయూతను అందిస్తారని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీజీ భరత్ గెలుపు కోసం అల్లాను ప్రార్థించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ వార్డు ఇంఛార్జీ మొహబూబ్ ఖాన్, మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బషీర్, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి జహంగీర్ బాష, మౌలాన్ ముస్తఫా, ఖాజా, గౌస్, జియా, ఫర్జానా, సఫా, చిన్నమ్మి తదితర ముఖ్య నాయకులు, బూత్ ఇంఛార్జ్‌లు పాల్గొన్నారు.