నేడు పత్తికొండలో సిపిఐ జనరల్ బాడీ సమావేశం
1 min readసిపిఐ జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య.
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: శుక్రవారం నాడు పత్తికొండ నియోజకవర్గం స్థాయి సిపిఐ జనరల్ బాడీ సమావేశం స్థానిక చదువుల రామయ్య భవనంలో నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య తెలిపారు.గురువారం సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు చాలా ప్రాధాన్యత ఉందని, సిపిఎం, కాంగ్రెస్, ఇండియా కూటమి బలపరుస్తున్న పత్తికొండ నియోజకవర్గం సిపిఐ అభ్యర్థిగా పి. రామచంద్రయ్య ఎన్నికల బరిలో నిలుస్తున్నారని తెలిపారు. మతోన్మాద మోడీతో దేశానికి పెను ప్రమాదం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో అధికార వైసిపి, తెలుగుదేశం పార్టీలు బిజెపితో ప్రత్యక్షంగా, పరోక్షంగా అంటకాగు తున్నాయని విమర్శించారు. కేంద్రంలో మోడీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ఏమాత్రం నెరవేర్చకుండా, ప్రజలను మరోసారి మోసం చేసేందుకు మోసపూరితపు హామీల తో ఎన్నికలకు వస్తున్నారని, మతోన్మాద బిజెపిని ఇంటికి సాగనంపాలన్నారు. రాష్ట్రంలో 2014-2019 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారని, 2019 -2024 వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం కృషి చేసింది లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం ప్రజా పోరాటాలు చేస్తున్న సిపిఐ అభ్యర్థి పి. రామచంద్రయ్య ను గెలిపించుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈనెల 5న పత్తికొండలో తలపెట్టిన ఎన్నికల సన్నాహక సమావేశానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే కె. రామకృష్ణ, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు గఫూర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాబురావు, ఇండియా కూటమి పార్లమెంట్ అభ్యర్థి రాం పుల్లయ్య యాదవ్ లు హాజరవుతారని తెలిపారు.