ముస్లింలకు మేలు చేసింది ఒక్క టీడీపీనే
1 min readకర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్
కర్నూలు, పల్లెవెలుగు: రాష్ట్రంలోని ముస్లింలందరికీ అన్ని విధాల మేలు చేసింది ఒక్క తెలుగుదేశం పార్టీనేనని కర్నూలు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. నగరంలోని 6వ వార్డు గడ్డ ప్రాంతంలో జనసేన కర్నూలు ఇంఛార్జీ అర్షద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ అభ్యర్థి నాగరాజు, జనసేన పొలిట్ బ్యూరో సభ్యులు అర్హంఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముస్లింలకు పెద్ద పీట వేసిందన్నారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో ముస్లింల సంక్షేమం, అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశామన్నారు. మసీదుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని.. ఈ ఐదేళ్ల పాలనలో మసీదులకు వైసీపీ ఏం చేసిందో చెప్పాలన్నారు. 2018లో కర్నూలులో ఇస్తేమా నిర్వహించినప్పుడు రూ.10 కోట్లను టీడీపీ ఇచ్చిందని గుర్తు చేశారు. ముస్లింలకు రంజానో తోఫాను ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమాలన్నీ టీడీపీ, బీజేపీ పొత్తులో ఉన్నప్పుడే జరిగాయన్నారు. కేవలం ఎన్నికల ముందు బీజేపీతో టీడీపీ పొత్తు ఉందని, టీడీపీని గెలిపిస్తే ముస్లింలు నష్టపోతున్నారని అసత్య ప్రచారాలు చేసే వైసీపీ నేతల వ్యాఖ్యలు నమ్మొద్దని ముస్లిం సోదర, సోదరమణీలకు విజ్ఞప్తి చేశారు. సీఏఏ బిల్లుకు వైసీపీ పార్లమెంట్‌లో మద్దతు తెలపడమే కాకుండా.. రాష్ట్రంలో నోటిఫికేషన్ సైతం తెచ్చిందన్నారు. మంచి పనులు చేస్తున్న తెలుగుదేశం పార్టీపై నిందలు వేయడం సబబు కాదన్నారు. రానున్న ఎన్నికల్లో కచ్చితంగా గడ్డ ప్రాంతంలో ప్రజలు అందరూ తనకు మద్దతు తెలపాలని కోరారు. తమ దగ్గర అన్ని కులమతాల వారు పనిచేస్తున్నప్పుడు ఎన్నికల సమయంలో తమను ఎందుకు వేరు చేసి చూపుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి జహంగీర్ బాష, నగర మైనార్టీ కమిటీ అధ్యక్షుడు హమీద్, నాయకులు మహబూబ్ బాష, ఇబ్రహీం, బూత్ ఇంఛార్జీలు, జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.