PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షురాలుగా సిట్ర సత్య నారాయణమ్మ

1 min read

పంతం నెగ్గించుకున్న ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​

కర్నూలు, పల్లెవెలుగు:సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కర్నూలు రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది.  ప్రతిపక్ష కూటమి అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని… అధికార వైసీపీ నిర్ణయాలు తీసుకుంటోంది. వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షురాలిగా 25 వ వార్డు కార్పొరేటర్​, నగర అధ్యక్షురాలు సిట్ర నారాయణమ్మను అధికారికంగా నియమించింది. దీంతో కర్నూలు  రాజకీయం రసవత్తరంగా మారింది. కూటమి ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు కురువ కులస్తుడు కావడంతో… అదే కులానికి చెందిన సిట్ర నారాయణమ్మను జిల్లా అధ్యక్షురాలుగా నియమించింది.

మాజీ ఎమ్మెల్యేకు నిరాశే…!

కర్నూలు జిల్లా అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్​ రెడ్డికి వస్తుందని ఆయన వర్గీయులు సోషల్​ మీడియాలో ప్రచారం దుమారం లేపారు. కానీ వైసీపీ అధిష్టానం కర్నూలు నగర అధ్యక్షురాలు, 25వ వార్డు కార్పొరేటర్​ సిట్ర నారాయణమ్మను నియమించింది. వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కొందరు హర్షం వ్యక్తం చేయగా.. మరికొందరు కోపోద్రిక్తులవుతున్నారు. కర్నూలు ఎమ్మెల్యే టిక్కెట్​ ఆశించి.. విశ్వప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. జిల్లా అధ్యక్ష పదవి అయినా వరిస్తుందని ఆశించిన మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్​ రెడ్డికి నిరాశే ఎదురైంది.

పంతం నెగ్గించుకున్న ఎమ్మెల్యే:

కర్నూలు నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్​ రెడ్డికి ఎప్పటి నుంచే వర్గ విభేదాలు ఉన్న విషయం ప్రజలకు తెలిసిందే. కర్నూలు వైసీపీ అధ్యక్ష పదవి తమ వర్గీయులకే దక్కించుకోవాలని ఎమ్మెల్యే  హఫీజ్​ఖాన్​ చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. విజయవాడలో వైసీపీ అదిష్టానంతో పంతం పట్టి… సిట్ర నారాయణమ్మకు కర్నూలు జిల్లా అధ్యక్ష పదవి అప్పగించినట్లు ఎమ్మెల్యే హఫీజ్​ఖాన్​ వర్గీయులు పేర్కొనడం గమనార్హం.  

7 సీట్లు గెలిపిస్తా…. : సిట్ర సత్యనారాయణమ్మ

కర్నూలు జిల్లా పరిధిలోని ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ, మంత్రాలయం, కోడుమూరు, కర్నూలు నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపునకు తనవంతు కృషి చేస్తానని జిల్లా అధ్యక్షురాలు సిట్ర సత్యనారాయణమ్మ ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 సీట్లు గెలుపొంది… విజయఢంకా మోగించామని, ప్రస్తుత ఎన్నికల్లోనూ వైసీపీ అన్ని నియోజకవర్గాల్లో గెలుపొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డికి 14 నియోజకవర్గాల్లో గెలుపొంది…. కానుకగా ఇస్తామని ఈ సందర్భంగా వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షురాలు సిట్ర సత్యనారాయణమ్మ పేర్కొన్నారు.

About Author