PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శాంతియుతంగా ఎన్నికలను నిర్వహించే బాధ్యత డిఇఓలు, ఎస్పీలదే

1 min read

ఓర్పుతో వ్యవహరిస్తూ అవగాహనతో సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కరించండి

నగదు జప్తు విషయంలో సాధారణ పౌరులకు ఎటువంటి ఇబ్బందులు కలిగించవద్దు

నగదు జప్తు కేసులను 24 గంటల్లోనే పరిష్కరించాలి, రాష్ట్ర మంతా ఒకే ఎస్.ఓ.పి అమలుకు చర్యలు

ఇసిఐ నుండి సరైన వివరణ వచ్చేలోపు ఇంటింటి ప్రచారానికి ముందస్తు సమాచారం ఇస్తే చాలు

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సాధారణ ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛగా మరియు న్యాయబద్దంగా నిర్వహించాల్సిన బాధ్యత జిల్లా ఎన్నికల అధికారులు మరియు ఎస్పీలపైనే ఉంటుందని అందుకుగాను ఇరువురూ సమన్వయము, ఓర్పుతో వ్యవహరిస్తూ సమస్యలపై సమగ్ర అవగాహనలతో తక్షణమే స్పందిస్తూ పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు.శనివారం రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీస్ సూపరింటెండెట్లు, పోలీస్ కమిషనర్లతో ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు చేస్తున్న ఏర్పాట్లు, తీసుకుంటున్న చర్యలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్టంగా అమలుపర్చే అంశాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వీడియో కాన్పరెన్సు ద్వారా సమీక్షించారు.ఈ సందర్బంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఎటువంటి హింసకు, రీపోలింగ్ కు తావులేకుండా పటిష్టమైన భద్రతా చర్యలను చేపట్టాలన్నారు. గంజాయి, లిక్కర్, నగదు, ఉచితాల అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘా ఉంచాలని, రాష్ట్రాల సరిహద్దులు, జిల్లాల సరిహద్దుల్లో ఉండే చెక్ పోస్ట్ లో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. గోవా, హర్యానా నుండి అక్రమంగా లిక్కర్ రాష్ట్రంలోకి రాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, వ్యక్తులు రూ.50 వేలకు మించి నగదు కలిగి ఉంటే వెంటనే జప్తుచేయాలని, వ్యాపారులు, సాదారణ పౌరుల విషయంలో ఆచితూచి అడుగువేయాలని, వారిని ఎటువంటి ఇబ్బందులకు గురిచేయవద్దన్నారు. నగదు జప్తు కేసులను 24 గంటల్లోనే పరిష్కరించాలని, ఇందుకై రాష్ట్ర మంతా ఒకే విదానాన్ని అనుసరించేలా త్వరలో ఎస్.ఓ.పి.ని (Standard Operating Procedure) రూపొందించి కమ్యునికేట్ చేయనున్నట్లు తెలిపారు.రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇంటింటి ప్రచారానికై ముందస్తుగా పొందాల్సిన అనుమతి విషయంలో తగిన వివరణకై భారత ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపడమైనదని, అయితే ఈ అంశంలో తగిన వివరణ అందేలోపు ఇంటింటి ప్రచారానికి సంబందించి  ముందస్తు సమాచారాన్ని సంబందిత ఆర్.ఓ.కు మరియు సంబందిత పోలీస్ స్టేషన్ కు ఇస్తే చాలు అనే విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలకు తెలియజేయాలని సూచించారు.భారత ఎన్నికల సంఘం రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిందని, వీరే ఎన్నికల సంఘానిక కళ్లు, చెవులు వంటి వారని, వీరు నేరుగా ప్రధాన ఎన్నికల కమీషనర్ నేతృత్వంలో పనిచేస్తుంటారన్నారు. ప్రత్యేక సాధారణ పరిశీలకులు, ప్రత్యేక వ్యయ పరిశీలకు ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పర్యటించారన్నారు. రాష్ట్రంలో చేస్తున్న ఎన్నికల ఏర్పాట్లు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు విషయంలో వీరు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలన్నారు.ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన ఫిర్యాదులపై తక్షణమే చర్యలు చేపట్టాలని, తమ కార్యాలయం నుండి  పంపించే ఫిర్యాదులపై జిల్లా స్థాయిలోనే సమగ్రమైన విచారణ జరిపి చర్యలు తీసుకున్న తదుపరి మాత్రమే నివేదిక పంపాలని ఆదేశించారు.వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్, ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ మురళీ తదితరులు పాల్గొన్నారు.

About Author