పసుపుదళంలోకి భారీ చేరికలు..
1 min readపలువురికి కండువా కప్పి బడేటి చంటి సాదరంగా ఆహ్వానం
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పాలనకు ఈ ఎన్నికల్లో ఓటుతో చరమగీతం పాడాలని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్ధి బడేటి చంటి పిలుపునిచ్చారు.ఏలూరు పడమరవీధిలోని మధ్యాహ్నపు బలరాం గృహం వద్ద జరిగిన కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పసుపుదళంలోకి చేరారు. వారందరికీ ఉమ్మడి అభ్యర్ధి బడేటి చంటి కండువాలు కప్పి, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జల్లా హరికృష్ణ, తన్నీరు సత్యన్నారాయణ, వెలుగుల సతీష్, సాగిరాజు రవిరాజు, మధ్యాహ్నపు శివశంకర్, కర్పూరపు కృష్ణతో పాటు సుమారు 50 మంది పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ ప్రస్తుత ఎమ్మెల్యే ఆళ్ళ నాని ప్రజలకు అందుబాటులో ఉండి మంచి పాలన అందించి ఉంటే ఇంతమంది నాయకులు, కార్యకర్తలు పార్టీని వీడే పరిస్థితులు ఉండేవి కావన్నారు. ఎమ్మెల్యేను ఓడించేందుకే సొంతపార్టీ నాయకులే ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేనలో చేరుతున్నారని చెప్పారు. ఉన్నత ఆశయంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేతులు కలిపారని, ఆ ఆశయసిద్ధికి ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన మధ్యాహ్నపు ఈశ్వరీ, బలరాం దంపతులు ప్రతి డివిజన్ లో పార్టీని బలోపేతం చేసేందుకు కృషిచేస్తున్నారని, అందుకే పార్టీలో చేరికలు ఊపందుకున్నాయని చెప్పారు. పార్టీలోని ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యత ఉంటుందని, ఎవరూ అన్యధా భావించవద్దని చెప్పారు. అందరి అనుభవాలను పరిగణలోకి తీసుకుని ఏలూరు నగరాభివృద్ధే లక్ష్యంగా కృషిచేస్తానని, త్వరలో జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి, తనను గెలిపించాలని బడేటి చంటి కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఛైర్మన్ మధ్యాహ్నపు ఈశ్వరి, మధ్యాహ్నపు బలరాం, పలువురు కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.