PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఐఏఎస్​ టు..అసెంబ్లీ అభ్యర్థిగా…

1 min read

సీఎం వైఎస్​ జగన్​ చెబితేనే…. బరిలోకి దిగా..

  • కర్నూలు ప్రజల కష్టసుఖాలు దగ్గరుండి విన్నా…
  • ఐఏఎస్​గా ఉత్తమ సేవలు అందించా…
  • అదే స్థాయిలో ప్రజాప్రతినిధిగా కర్నూలువాసులకు సేవ చేస్తా…
  • పార్టీలో వర్గ విభేదాలు లేవు…మా దంతా జగన్​ వర్గమే..
  • ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్​ రెడ్డి పార్టీ కోసం పని చేస్తారు…
  • నా గెలుపునకు విశేష కృషి చేస్తున్నారు…
  • యువతను ఉపాధి సృష్టికర్తలుగా తీర్చిదిద్దుతా…
  • కర్నూలులో సమ్మర్​ స్టోరేజ్​ ట్యాంకు నిర్మాణానికి కృషి చేస్తా…
  • తాగునీటి సమస్యను శాశ్వితంగా పరిష్కరిస్తా…
  • సీఎం మేనిఫెస్టో తరువాత… కర్నూలు అభివృద్ధికి నా మేనిఫెస్టో ప్రకటిస్తా…
  • వైసీపీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి ఎం.ఏ. ఇంతియాజ్​ ఐఏఎస్​

విజయవాడ కలెక్టర్​గా పని చేసి ఎన్నో అవార్డులు..మరెన్నో ప్రశంసలు పొందిన ఎం.ఏ. ఇంతియాజ్​….కర్నూలు ప్రజల రుణం తీర్చుకునేందుకు ఐఏఎస్​కు వీఆర్​ఎస్​ తీసుకుని.. వైసీపీ అసెంబ్లీ బరిలో దిగారు. సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి మెచ్చిన కలెక్టర్లలో ఒకరైన ఎం.ఏ. ఇంతియాజ్​ …తనను గెలిపిస్తే యువతకు ఉపాధి కల్పించడంతోపాటు… వారిని ఉపాధి సృష్టికర్తలుగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నారు. అదేవిధంగా కర్నూలు ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు శాశ్విత పరిష్కారం చూపేందుకు ఐఏఎస్​ ఆలోచన విధానాన్ని అమలు చేస్తానని వెల్లడించారు. పల్లెవెలుగు ప్రతినిధి నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో  ఆయన పలు అంశాలపై ప్రజలకు స్పష్టత ఇచ్చారు.

కర్నూలు, పల్లెవెలుగు:

ప్రశ్న. మీరు కలెక్టర్​ కదా…. ఎందుకు రాజకీయాల్లోకి వస్తున్నారు..?

ఇంతియాజ్​​: కలెక్టర్​గా ప్రజలకు సేవ చేసేందుకు ఒక రూల్​ పాటించాలి. అన్ని వర్గాల ప్రజలకు మనస్ఫూర్తిగా సేవ చేసేందుకు అవకాశం తక్కువగా ఉంటుంది. ఒక ప్రజాప్రతినిధిగా అయితే…సేవకు పరిమితులు ఉండవు. ప్రతిఒక్కరికీ సేవ చేసే అవకాశం ఉంటుంది. కలెక్టర్​గా నా సేవలను సీఎం వైఎస్​ జగన్ మోహన్​ రెడ్డి​ మెచ్చుకున్నారు.  కలెక్టర్​గా సేవలు ఎలా చేశారో…. ఒక ఎమ్మెల్యేగా కర్నూలు వాసులకు సేవ చేయాలని సూచించారు. నాకు ఇష్టమైన నాయకుడు సీఎం జగన్​ చెబితేనే… రాజకీయాల్లోకి వచ్చా.  కర్నూలు అసెంబ్లీ బరిలో దిగాను. ప్రజల రుణం తీర్చుకుంటా.

ప్ర. కర్నూలులో ప్రధాన సమస్య ఏమిటి… మీరెలా పరిష్కరిస్తారు…

జ​:ఇక్కడ తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నట్లుగా గుర్తించా. వేసవిలో ప్రజలు దాహార్తి తీర్చుకునేందుకు అవస్థలు పడుతున్నారు. ఒక కలెక్టర్​గా విధులు నిర్వర్తించిన నేను…కర్నూలులో శాశ్విత తాగునీటి సమస్యకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తా. కలెక్టర్ల ఆలోచన విధానం అమలు చేస్తా.  సమ్మర్​ స్టోరేజ్​ ట్యాంకు నిర్మించి… తాగునీటి సమస్య లేకుండా చేస్తా. ఈ విషయంపై నేను కట్టుబడి ఉంటా.

ప్రశ్న. యువతకు ఉపాధి అవకాశాలు లేవు… మీరెలా కల్పిస్తారు…?

జ​:నేను మార్నింగ్​ వాక్​ పేరిట ప్రజలను ప్రతి రోజు పలకరిస్తున్నాను. ఇక్కడ చాలా మంది యువత టీ స్టాల్స్​ దగ్గర  గుంపు గుంపులుగా కనిపించారు. అలాంటి వారికి ఉపాధి అవకాశాలపై నైపుణ్యం పెంపొందించేలా చర్యలు తీసుకుంటా. వివిధ రంగాలకు సంబంధించి… శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి… యువతను నైపుణ్యులుగా తీర్చిదిద్దుతా. ఒకరికి  ఉపాధి చూపడం నా లక్ష్యం కాదు… ప్రతి ఒక్కరూ (యువత) ఉపాధి సృష్టికర్తలుగా తయారు చేయడమే నా లక్ష్యం.

ప్రశ్న.ఉత్తమ కలెక్టర్​గా మీరు అందించిన సేవలు ఏమిటి?

జ​:నేను నెల్లూరు, గుంటూరు జాయింట్​ కలెక్టర్​గా, కృష్ణా. విజయవాడ జిల్లాలో కలెక్టర్​గా విధులు నిర్వర్తించా.  కలెక్టర్​గా ఎన్నో సేవలు చేశా.. ఎందరివో ప్రశంసలు పొందాను. వృద్ధులకు పింఛన్​ ఇప్పించడంలో రాష్ట్రంలోనే మొదటి జిల్లాగా విజయవాడ ఎంపికైంది. ప్రతి సోమవారం నిర్వహించే ‘స్పందన’కు వచ్చే సమస్యల్లో దాదాపు 90శాతం పరిష్కరించా. కరోన సమయంలో ప్రజలకు వైద్య సేవలు అందేలా చూశా. ఆ సమయంలో సేవ చేసేందుకు వచ్చిన ప్రతి స్వచ్ఛంద సంస్థకు, ప్రతి ఒక్కరికి సహకరించాను. అందుకుగాను ఉత్తమ అవార్డు అందుకున్నా. రాష్ట్రస్థాయి ప్రముఖులతో మన్ననలు పొందాను.

ప్ర. మీరు ఐఏఎస్​… మిమ్మల్ని కలిసేందుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారంట కదా… నిజమేనా..?

జ. నేను సామాన్య…మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చా. అందరితో కలివిడిగా ఉంటాను. ప్రచారంలో భాగంగా ప్రతి రోజు సాయంత్రం అన్ని వార్డులలో ఇంటింట ప్రచారం చేస్తున్నాను. అందరూ నన్ను అప్యాయంగా పలకరిస్తున్నారు. నేను కూడా మంచిగా పలకరిస్తూనే..ముందుకు వెళ్తున్నా. పేద బడుగు బలహీన వర్గాల ప్రజలే నా దేవుళ్లు. ప్రతిపక్ష నాయకులు నా పై తప్పుడు ప్రచారం చేస్తుంటారు. అవేమీ నమ్మకండి. నా మనస్తత్వం ఏమిటో నగర ప్రజలకు తెలుసు.

ప్ర. ఎమ్మెల్యే హఫీజ్​ఖాన్​, మాజీ ఎమ్మెల్యే మధ్య వర్గ విభేదాలు ఉన్నాయా…? వారిద్దరిని నమ్మి పోటీలో దిగారా..?

జ. ప్రతి పార్టీలో చిన్న చిన్న సమస్యలు ఉండటం సహజం. ఎమ్మెల్యే హఫీజ్​ఖాన్​, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్​ రెడ్డి ఇద్దరి మధ్య వర్గ విభేదాలు లేవు. ఇద్దరు కూడా పార్టీ కోసం పని చేస్తున్నారు.  వారిద్దరితోపాటు నేను ఇంటింట ప్రచారం చేస్తున్నాను. ఇఫ్తార్​ విందు కార్యక్రమంలో పాల్గొంటున్నా. వారిద్దరి ఐడియాలజిని ఫాలో అవుతున్నా. నాకెక్కడా అలా అనిపించలేదు. ఇద్దరు నా గెలుపునకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఆ విధంగానే ముందుకు వెళ్తున్నా.

ప్ర. మీకే .. ఓటు ఎందుకు వేయాలి?

జ. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల వల్ల కోట్ల మంది ప్రజలు లబ్ధిపొందారు. మళ్లీ వైసీపీకి అవకాశం ఇస్తే… సంక్షేమ పథకాలు కొనసాగింపుతోపాటు రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామన్న నమ్మకం ప్రజల్లో ఉంది. కర్నూలు ప్రజలకు సేవ చేసేందుకే… కలెక్టర్​ ఉద్యోగానికి వీఆర్​ఎస్​ తీసుకున్నా. నన్ను గెలిపిస్తే.. కర్నూలు ప్రజల రుణం తీర్చుకుంటా. నగరంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా. నగరాన్ని స్మార్ట్​ సిటీగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఇవ్వమని కోరుతున్నా. యువతకు ఉపాధి సృష్టికర్తలుగా తీర్చిదిద్దుతా. ఇవన్నీ చేస్తానని ప్రచారంలో భాగంగా ప్రజలకు స్పష్టమైన హామీ ఇస్తున్నా. గెలిపించాలని అభ్యర్థిస్తున్నా.

About Author