ఓటు హక్కును సద్వినియోగం చేసుకోండి…ఆర్ ఓ నారపరెడ్డి మౌర్య..
1 min readపల్లెవెలుగు న్యూస్ గడివేముల: ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని నినాదంతో సోమవారం తాసిల్దార్ కార్యాలయం నుండి పాత బస్టాండ్ వరకు రిటర్నింగ్ ఆఫీసర్ నారపరెడ్డి మౌర్య ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాత బస్టాండ్ ఆవరణంలో రెవెన్యూ సిబ్బంది సచివాలయ సిబ్బంది మానవహారంగా ఏర్పడి ఓటు హక్కును అందరు సద్వినియోగం చేసుకోవాలని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి నారపరెడ్డి మౌర్య మాట్లాడుతూ ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగించుకోవాలని అన్నారు.ఓటింగ్ శాతం పెరిగేలా, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా అవగాహన చేయాలన్నారు.పోలింగ్ రోజున ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటిస్తుందని, ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అన్ని ప్రాంతాల్లో ఆయా ఓటర్‌లకు అందుబాటులోనే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేశామని చెప్పారు. హక్కులకు భంగం కలిగితే ఎలా ప్రశ్నిస్తామో అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరూ మే 13న ముందుకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. ఎస్సై బీటీ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ, నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకొవడానికి గానూ ఓటర్లలో విశ్వాసాన్ని పెంపొందిస్తున్నామని, అందులో భాగంగానే కేంద్ర బలగాలు ఆధ్వర్యంలో సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద, గత ఎన్నికలలో చెదురు ముదురు ఘటనలు జరిగిన ప్రాంతాల్లో పోలిస్ కవాతు ప్రదర్శన నిర్వహిస్తున్నామని వివరించారు. ప్రజలు భయమేమీ లేకుండా నిర్భయంగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ జమనుల ఖాన్, డిప్యూటీ తహసిల్దార్ గురునాథం, ఎంపీడీవో శివరామిరెడ్డి, ఎస్సై బిటి వెంకటసుబ్బయ్య సచివాలయ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది జి ఎం ఎస్ కే సిబ్బంది బీ ఎల్ వోలు తదితరులు పాల్గొన్నారు.