విశాఖలో ఏఐఎన్‌యూ ఈవెనింగ్ క్లినిక్ ప్రారంభం
1 min readయూరాలజీ, నెఫ్రాలజీ ప్రాథమిక సేవల కోసం ఏర్పాటు
వారానికి రెండు రోజులు వైద్యనిపుణుల అందుబాటు
పల్లెవెలుగు వెబ్ విశాఖపట్నం : విశాఖపట్నం నగరంలోని మధురవాడ నుంచి ఎండాడ, ఆనందపురం పరిసర ప్రాంతాల వారికి వైద్యపరమైన అవసరాలు తీర్చేందుకు ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) పీఎం పాలెం ప్రాంతంలో తన ఈవెనింగ్ క్లినిక్‌ను ప్రారంభించింది. ఇక్కడ ప్రస్తుతం వారానికి రెండు రోజులు యూరాలజీ, నెఫ్రాలజీ వైద్య నిపుణులు ఉండి అన్ని రకాల సమస్యలకు కన్సల్టేషన్లు, ల్యాబ్ పరీక్షలు, వ్యాధి నిర్ధారణ తదితర సేవలు అందిస్తారు. శివారు ప్రాంతాలవారు ట్రాఫిక్‌ను దాటుకుని నగరం నడిబొడ్డున ఉన్న ఆస్పత్రులకు వైద్యం కోసం వెళ్లడం ఇబ్బంది అవుతుంది కాబట్టి, వారి అవసరాలు తీర్చేందుకు ప్రత్యేకంగా ఈ ఆస్పత్రిని ఏర్పాటుచేసినట్లు ఏఐఎన్‌యూకు చెందిన వైద్యులు తెలిపారు. ఇక్కడ యూరాలజీ, నెఫ్రాలజీ, పీడియాట్రిక్ నెఫ్రాలజీ లాంటి విభాగాలకు చెందిన నిపుణులు రోజు విడిచి రోజు అందుబాటులో ఉంటారు. కార్ షెడ్ జంక్షన్ ప్రాంతంలోని డాక్టర్ క్యూర్ మల్టీ స్పెషాలిటీ పాలీక్లినిక్ భవనంలోనే ఏఐఎన్‌యూ ఈవెనింగ్ క్లినిక్ కూడా ఉంటుంది. ఉగాది పర్వదినం సందర్భంగా ఈ క్లినిక్‌ను యూరాలజిస్టులు డాక్టర్ రవీంద్రవర్మ, డాక్టర్ అమిత్ సాప్లే, డాక్టర్ శ్రీధర్, నెఫ్రాలజిస్టు డాక్టర్ ఉదయ్ తదితరులు ప్రారంభించారు. ఇక్కడ ప్రాథమికంగా చూసిన తర్వాత సమస్య మరీ తీవ్రంగా ఉంటే అప్పుడు తదుపరి చికిత్సల కోసం ద్వారకానగర్‌లో ఉన్న ప్రధాన ఆస్పత్రికి పంపుతారు.