ఆదోని అభివృద్ధి చెందాలంటే.. ఎమ్మెల్యే మారాలి
1 min readపదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా… ఏనాడూ అసెంబ్లీలో మాట్లాడని సాయిప్రసాద్ రెడ్డి
- ధనార్జనే ధ్యేయంగా… భూ కబ్జాలు… కర్ణాటకకు రేషన్, ఇసుక తరలింపు..
- అక్కడి నుంచి లిక్కర్ తరలింపు… మట్కా..పేకాటలో కమీషన్లు…
- వచ్చేది కూటమి ప్రభుత్వమే…
- ఆదోనిని అభివృద్ధి చేసే బాధ్యత మాది…
- హిందూ, ముస్లింల అభ్యున్నతికి కృషి చేస్తా…
- వాల్మీకులను ఎస్సీ జాబితాలో చేర్చే బాధ్యత నాది…
- కార్యకర్తల సమావేశంలో కూటమి అసెంబ్లీ అభ్యర్థి డా. పార్థసారధి
ఆదోని, పల్లెవెలుగు: అభివృద్ధి లేక….రాష్ట్రంలోనే ఆదోని వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు పొందిందని, ఇక్కడి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పదేళ్లు అధికారంలో ఉన్నా అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా… ధనార్జనే ధ్యేయంగా కోట్ల రూపాయలు సంపాదించారని ఆదోని కూటమి అసెంబ్లీ అభ్యర్థి డా. పార్థసారధి ఆరోపించారు. పట్టణంలోని జె.బి.గార్డెన్లో శుక్రవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు, ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి అసెంబ్లీ అభ్యర్థి డా. పార్థసారధి మాట్లాడుతూ ఆదోని అభివృద్ధి చెందాలంటే.. ఎమ్మెల్యే మారాలి… అనే నినాదంతో దూసుకుపోవాలని పిలుపునిచ్చారు. పట్టణం నడిబొడ్డున శ్రీనివాస భవన్ సర్కిల్లో రోడ్ల విస్తరణ లేక ప్రజలు అవస్థలు పడుతుంటే…. కమీషన్ల కోసం కక్కుర్తి పడి…. పబ్బం గడుపుకుంటున్నాడని ఘాటుగా విమర్శించారు.
అభివృద్ధి వద్దు… ధనార్జనే ధ్యేయం…:
ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఆదోని అభివృద్ధి చెందకుండా… పదేళ్లు తన అనుచరగణంతో లాభపొందాడని, ధనార్జనే ధ్యేయంగా కోట్ల రూపాయలు అర్జించాడని డా. పార్థసారధి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదోనిలో ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే… ఆ స్థలాన్ని కబ్జా చేస్తాడనే భయం ప్రజల్లో ఎక్కువగా ఉందన్నారు. నియోజకవర్గం నుంచి రేషన్ బియ్యం, ఇసుక కర్ణాటకకు తరలించడం… అక్కడి నుంచి మద్యం, పెట్రోల్ ఇక్కడికి తరలించి సొమ్ము చేసుకోవడం సాయి ప్రసాద్ రెడ్డి వర్గానికే చెల్లిందన్నారు. మట్కా… పేకాటలో ఆదోనిని నెంబరు వన్‌గా మార్చాడని, ఇదంతా ఎమ్మెల్యే చొరవ కాదా అని ప్రశ్నించారు.
హిందూ,ముస్లింల అభివృద్ధికి కృషి:
దేశ ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో దేశం అభివృద్ధి చెందుతోందని ప్రపంచ దేశాలు మెచ్చుకున్నాయన్న డా. పార్థసారధి …. నియోజకవర్గంలో హిందూ, ముస్లిం సోదరుల అభ్యున్నతికి కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
వాల్మీకులను ఎస్టీ జాబితా చేర్చే బాధ్యత నాదే…:
ఎస్టీ జాబితాలో చేర్చాలని ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేస్తున్న వాల్మీక సోదరులను ఎస్టీ జాబితాలో చేర్చే బాధ్యత నాది అని డా. పార్థసారధి స్పష్టం చేశారు. ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, జనసేన నాయకుడు మల్లప్ప, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కనిగిరి నీలకంఠం… ఇలా మూడు పార్టీల వాళ్లు కలిసి ప్రచారానికి వెళ్తున్నామని, విజయం తథ్యమని ఈ సందర్భంగా డా. పార్థసారధి ధీమా వ్యక్తం చేశారు.
ఆదోని అభివృద్ధి… నా బాధ్యత…:
డాక్టర్ వృత్తిలో ఉన్న తాను…. ఎవరికి హాని తలపెట్టనని, అవినీతి అక్రమాలకు వెళ్లే ప్రసక్తే ఉండదని కూటమి అసెంబ్లీ అభ్యర్థి డా. పార్థసారధి పేర్కొన్నారు. ఆదోని అభివృద్ధి చేసే బాధ్యత నాది అని… ఇందుకు నియోజకవర్గ ప్రజలకు స్పష్టమైన హామీ ఇస్తున్నానని వెల్లడించారు.