ఆమె మరణించినా బతికే ఉంది..
1 min read– అవయవదానానికి ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులు
– లివర్, కిడ్నీలు, గుండె దానం
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : అనారోగ్య కారణాల చేత ఇంటి ఇల్లాలు మరణించి పుట్టెడు దుఖంలో ఉన్నప్పటికీ వారి కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం ఎందరికో స్ఫూర్తిధాయకమైంది. కడప జిల్లా ప్రొద్దూటూరు ప్రాంతానికి చెందిన దొంతు కృష్ణవేణి (38) గృహిణి. గురువారం ఫిట్స్ రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ఆసుప్రతికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కిమ్స్ హాస్పిటల్ కర్నూలుకు తరలించారు. రోగిని పరీశీలించిన వైద్యులు తలలో బ్లడ్ క్లాట్ అయ్యిందని గుర్తించారు. ఆమెను రక్షించడానికి రెండు రోజులుగా వైద్యులు ఎంతో శ్రమించారు. కానీ దురదృష్టవాశాస్తూ శనివారం ఉదయం బ్రెయిన్ డెడ్ అయ్యారు. ఆ తర్వాత అవయవదానంపై అవయవదాన సమన్వయకర్తలు మృతురాలి కుటుంబ సభ్యులకు, బంధువలకు అవగాహన కల్పించారు. అనంతరం భర్త, కుటుంబ సభ్యుల అంగీకారంతో లివర్, కిడ్నీలు, గుండె దానం చేశారు. చనిపోతూ కూడా మరో నలుగురికి ప్రాణదానం చేయడం మాకు గర్వంగా ఉందని మృతురాలి భర్త, కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అనంతరం జీవన్ ధాన్ రాష్ట్ర కోఆర్టినేటర్ రాంబాబు ఆధ్వర్యంలో కర్నూలు ట్రాఫిక్ పోలీసుల సహకారంతో ఏర్పాటు చేసిన గ్రీన్ ఛానెల్ ద్వారా లివర్, గుండెను వాయు మార్గంలో తిరుపతికి తరలించారు. కిడ్నీని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారని జీవన్ ధాన్ కమిటీ సభ్యులు తెలిపారు. ఆమె పార్థివదేహం తరలించే ముందు కిమ్స్ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది గౌరవ వందనం చేశారు.