దేశానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలంటే క్రీడలే ప్రధాన సాధనం
1 min readతైక్వాండో వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రా లజిస్ట్ డాక్టర్ శంకర శర్మ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: విద్యార్థులు చెడు అలవాటులకు దూరంగా దేశానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలంటే చిన్నతనం నుంచే వారు క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. కర్నూల్ నగరంలోని పెద్ద మార్కెట్ వద్ద ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మండపంలో కరాటే శిక్షకుడు వెంకటేష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వేసవి శిక్షణ శిబిరాన్ని ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులు పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని తెలియజేస్తూ వారికి ఆపిల్ పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ మాట్లాడుతూ ప్రతిరోజు ఒక ఆపిల్ పండు తినడం వల్ల డాక్టర్ వద్దకు వెళ్లే అవసరం లేకుండా ఉండవచ్చు అని చెప్పారు. ఆపిల్ పండులో మంచి పోషక విలువలు ఉన్నాయని దీనిని తినడం వల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకర జబ్బులకు కూడా దూరంగా ఉండవచ్చు అని చెప్పారు. విద్యార్థులను చిన్నతనం నుంచి క్రీడల్లో ప్రోత్సహించడం వల్ల వారిలో క్రమశిక్షణ, అంకితభావం పెంపొంది దేశానికి ఉపయోగపడే పౌరులుగా ఎరుగుతారన్నారు. దేశ భవిష్యత్తు రేపటి భావిభారత పౌరులైన నేటి బాలల్లోనే ఉందని అలాంటి బాలలను క్రమశిక్షణతో పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అలాంటప్పుడే వారు జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకొని దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారని వివరించారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల దేహ దారుఢ్యం మెరుగుపడటంతో పాటు మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు దీనివల్ల విద్యార్థులు చదువులో కూడా రానిస్తారని వివరించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సరైన శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల ఊబకాయ సమస్య అధికంగా ఉందని ,దీనివల్ల చిన్నతనంలోనే మధుమేహ వ్యాధి, రక్తపోటు, ఫ్యాటీ లివర్, గుండె సంబంధిత సమస్యలు వచ్చి అనారోగ్యం పాలవుతున్నారని చెప్పారు . క్రీడల్లో సాధన చేయడం వల్ల చిన్నతనంలోనే గంజాయి, మద్యం, మత్తు పదార్థాలకు యువత బానిసలు కాకుండా సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదుగుతారని చెప్పారు. ప్రస్తుతం వేసవి మండుటెండలు అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ తమ పనులను ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే చేసుకోవాలని, మధ్యాహ్నం వేళల్లో ఇంటిలోనే ఉండటం మంచిదని ఆయన సూచించారు. ఎండ వేడిమికి గురి కావడం వల్ల వడదెబ్బకు గురి కావడంతో పాటు శరీరంలో నీటి శాతం తగ్గిపోయి మూత్రపిండాల వైఫల్యం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే ఈ వేసవికాలంలో పరిశుభ్రమైన మంచి నీటిని మాత్రమే తీసుకోవాలని, కలుషితమైన నీటిని తీసుకోవడం వల్ల పసిరికలు, విరేచనాలు ,గ్యాస్ట్రో ఎంట రైటిస్ వంటి అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని చెప్పారు. కర్నూలు నగరంలో క్రీడల అభివృద్ధికి తన వంతు సహకారం నిరంతరం అందిస్తానని చెప్పారు. విద్యార్థులు కూడా వేసవి సెలవులను క్రీడలలో సాధన చేయడం ద్వారా సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ గ్యా స్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ సూచించారు.