అతిథి దేవోభవ…యంగ్ బ్లడ్ ఎథీనా రెండు పుస్తకాలు ఆవిష్కరణ
1 min readచిట్టిచేతుల మీదుగా గట్టి పుస్తకాలు
సుచిర్ ఇండియా గ్రూపు నుంచి రెండో తరం నాయికలు
అతిథి దేవోభవ పుస్తకం రచించిన రూపాలి యదుగిరి
యంగ్ బ్లడ్ ఎథీనా రచించిన దీప్షిక యదుగిరి
రచయిత్రులను అభినందించిన బీవీకే మోహన్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్ : చిన్న వయసులోనే లోకాన్ని చూసిన అనుభవంతో రాసినట్లు ఇద్దరు యువ రచయిత్రులు రాసిన పుస్తకాలు అమోఘంగా ఉన్నాయని సైయెంట్ ఛైర్మన్, పద్మశ్రీ బీవీకే మోహన్ రెడ్డి ప్రశంసించారు. బంజారాహిల్స్‌లోని హోటల్ రాడిసన్ బ్లూలో రూపాలి కిరణ్ యదుగిరి రచించిన అతిథి దేవోభవ, దీప్షిక యదుగిరి రచించిన యంగ్ బ్లడ్ ఎథీనా అనే రెండు పుస్తకాలను ఆయన ఆవిష్కరించి ప్రసంగించారు. సుచిర్ ఇండియా గ్రూపు వ్యవస్థాపకుడైన లయన్ డాక్టర్ వై. కిరణ్ కుమార్తెలయిన రూపాలి, దీప్షిక ఇద్దరూ అతి చిన్న వయసులోనే అత్యంత ప్రతిభా పాటవాలు కనబరుస్తూ.. ఒకవైపు తమ తండ్రి వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూనే మరోవైపు తమ సాహితీ అభిలాషను కూడా నెరవేర్చుకోవడం ఎంతో బాగుందని చెప్పారు. ఈ తరంలో పిల్లలంతా ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు ముందేసుకుని కూర్చుంటే వాళ్లు సమయం వృథా చేస్తున్నారని అంతా అనుకుంటామని, కానీ వాళ్లలోనూ వజ్రపు తునకలు ఉంటారన్న విషయం ఇలాంటి పుస్తకాలు చూసినప్పుడు తెలుస్తుందని ఆయన చెప్పారు. ఒక సాధారణ మనిషి సంపూర్ణ మానవుడిగా మారాలంటే అందుకు సాహిత్యం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. మనిషిని సమూలంగా మార్చగలిగే శక్తి ఒక్క సాహిత్యానికే ఉంటుందని తెలిపారు. ఎంతోమంది గొప్ప గొప్ప కవులు, రచయితలు, గ్రంథకర్తలు మనకు అందించిన అద్భుతమైన సంపద పుస్తకాలేనని మోహన్‌రెడ్డి అన్నారు. రామాయణ, భారత, భాగవతాల్లాంటి ఇతిహాసాలు మనకు అద్భుతమైన పర్సనాలిటీ డెవలప్‌మెంట్ నేర్పుతాయని చెప్పారు. అర్జునుడు పూర్తిగా డిప్రెషన్‌లో ఉన్నప్పుడు కృష్ణుడు భగవద్గీత బోధించి, ఆయనను యుద్ధం చేయడానికి మోటివేట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందేనని, అందువల్ల పుస్తకాలు చదవడం ఎప్పుడూ మంచి చేస్తుందని వివరించారు. ఈ సందర్భంగా రచయిత్రులలో ఒకరైన రూపాలి కిరణ్ యదుగిరి మాట్లాడుతూ, ఆతిథ్య పరిశ్రమ గురించి తాను రాసిన “అతిథి దేవో భవ” పుస్తకం గురించి అందరూ తమ అభిప్రాయాలు తెలపాలని కోరారు. తన సోదరి దీప్షిక యాదగిరిని కూడా ఆమె పరిచయం చేశారు. ఒక మనిషి వ్యక్తిగత ఎదుగుదలకు, జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడానికి ఉపయోగపడే పుస్తకం ఆమె రాసిన “యంగ్ బ్లడ్ ఎథీనా”అని చెప్పారు. రూపాలీ కిరణ్ యదుగిరి రాసిన “అతిథి దేవో భవ” పుస్తకం భారతీయ ఆతిథ్యరంగంలోని లోతుపాతుల గురించి చెబుతుంది. ఈ రంగం తన కెరీర్‌పై ఎంత ప్రభావం చూపించిందో ఆమె అందులో వివరించారు. ఒకవైపు వ్యక్తిగతంగా, మరోవైపు వృత్తిపరంగా కూడా ఈ ఆతిథ్యరంగాన్ని నిర్వచించే ఆప్యాయత, సహానుభూతి, సేవ ఎలా ఉంటాయో ఆమె తెలిపారు. ప్రస్తుత ప్రపంచంలో ఆతిథ్యరంగం సారాంశాన్ని, దాని ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం.. అతిథి దేవోభవ. “యంగ్ బ్లడ్ ఎథీనా”కు దీప్షికా యదుగిరికి ప్రేరణ… వ్యక్తిగత ఎదుగుదల, పడిపోయి మళ్లీ ఎదగడంపై ఆమెకు ఉన్న ప్రగాఢ విశ్వాసం నుంచే వచ్చింది. గ్రీకు పురాణ గాథల్లోని ఎథీనా అనే పాత్ర నుంచి ప్రేరణ పొందిన దీప్షిక.. తన జ్ఞానాన్ని, జీవిత అనుభవాల నుంచి సేకరించిన కొన్ని ఇన్‌సైట్లను పంచుకోవడానికే ఈ రచనా వ్యాసంగాన్ని ప్రారంభించారు. “యంగ్ బ్లడ్ ఎథీనా” ద్వారా, గ్రీకు దేవత ఆత్మను ప్రతిబింబిస్తూ, జీవితంలోని సవాళ్లను ధైర్యం, బలం, జ్ఞానంతో అధిగమించేందుకు పాఠకులను శక్తివంతం చేయాలని ఆమె లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ రెండు పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం ఎంతో లోతైన చర్చలు, పుస్తక పఠనాలు, రచయిత్రులు ఇద్దరితో మాట్లాడే అవకాశాల కలబోతగా నిలిచింది. సభకు హాజరైన సాహితీ అభిమానులు పలువురు ఈ ఇద్దరు యువ రచయిత్రులతో మాట్లాడి, అసలు వాళ్లకు ఈ పుస్తకాలు రాయాలన్న ఆలోచన ఎక్కడినుంచి వచ్చింది, పుస్తకాల వెనుక ఉన్న ప్రేరణ ఏంటనే విషయాల గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాఠకులకు తమను తాము పరిచయం చేసుకోవడానికి ఈ పుస్తకాలు ఒక మంచి అవకాశంగా లభించాయని రూపాలి, దీప్షిక ఈ సందర్భంగా చెప్పారు. పూర్తి వైవిధ్యమైన తమ నేపథ్యాలు, అనుభవాలు ఈ సాహితీ ప్రపంచానికి సేవ చేసేందుకు ఎలా ఉపయోగపడతాయో చెప్పారు. రూపాలీ కిరణ్ యదుగిరి డైనమిక్ రెండోతరం వ్యాపారవేత్త, సుచిర్ ఇడియా రిసార్ట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఎక్సలెన్స్, సామాజిక బాధ్యత పట్ల ఆమె అచంచలమైన నిబద్ధతకు ఆమె అనేక ప్రశంసలు పొందారు. వీటిలో బిజినెస్ ఎక్సలెన్స్ సమ్మిట్ లో “యంగ్ ఎంటర్ ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2023, టైమ్స్ బిజినెస్ అవార్డ్స్ 2023 లో “యంగ్ ఉమెన్ ఎంటర్ ప్రెన్యూర్ అవార్డు” ఉన్నాయి. ఇలా వరుసగా రెండు సంవత్సరాలు రెండు విభాగాల్లోనూ వరుస విజయాలు సాధించారు.సుచిర్ ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో రెండోతరం పారిశ్రామికవేత్త దీప్షిక యదుగిరి ప్రస్తుతం ఐఎస్‌బీలో మేనేజ్‌మెంట్ ఆఫ్ ఫ్యామిలీ బిజినెస్‌లో పీజీపీ చదువుతున్నారు. ఇంతకుముందు ఆమె వోక్సెన్ విశ్వవిద్యాలయం నుంచి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్‌లో బీబీఏ చేశారు. ఇంటర్నేషనల్ బిజినెస్ ప్లాన్ కాంపిటీషన్ 2020లో రెండోస్థానాన్ని సాధించడం, వోక్సెన్ విశ్వవిద్యాలయంలో ఇయర్‌బుక్ అసోసియేషన్‌కు ఎడిటర్-ఇన్-చీఫ్‌గా పనిచేయడం ఆమెకు లభించిన విశేష గుర్తింపులు. ఆమె బిజ్ టెక్ మ్యాగజైన్ కోసం 28 వ్యాసాలు కూడా రాశారు. గుర్రపు స్వారీ, నాటకరంగంలో రాణించారు.