శ్రీశైలంలో సీతారామచంద్రస్వామి వార్ల కల్యాణోత్సవం
1 min readపల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: ఈ నెల 17న శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవస్థాన అనుబంధ దేవాలయమైన శ్రీప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో శ్రీసీతారామచంద్రస్వామివార్ల కల్యాణోత్సవం జరిపించబడుతుంది.ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆంజనేయస్వామివారి ఆలయంలో ఉదయం నుండి సీతారాముల వారికి, ఆ తరువాత ఆంజనేయస్వామి వారికి విశేష పూజాదికాలు జరిపించబడుతాయి. తరువాత ఉదయం గం. 9.30 నుండి సీతారాముల కల్యాణోత్సవం జరిపించబడుతుంది.ఈ కల్యాణమహోత్సవంలో ముందుగా లోకసంక్షేమాన్ని కాంక్షిస్తూ సంకల్పం పఠించబడుతుంది. తరువాత కల్యాణోత్సవం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ జరిపించబడుతుంది.అనంతరం వృద్ధి, అభ్యుదయాలను కాంక్షిస్తూ పుణ్యాహవచనం జరిపించబడుతుంది. ఆ తరువాత కంకణపూజ, కంకణధారణ, యజ్ఞోపవీతపూజ, యజ్ఞోపవీతధారణ, నూతన వస్త్ర సమర్పణ, వరపూజ, ప్రవర పఠన, గౌరీపూజ, మాంగల్య పూజ, శ్రీ సీతాదేవివారికి మాంగల్యధారణ, తలంబ్రాలు మొదలైన కార్యక్రమాలతో సంప్రదాయ బద్దంగా సీతారామ కల్యాణం జరిపించబడుతుంది. కల్యాణోత్సవం తరువాత భక్తులకు తీర్థప్రసాదాలు అందజేయబడుతాయి.