కాంగ్రెస్‌కు..పూర్వ వైభవం తీసుకొస్తా..
1 min readరాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బాటనే నడుస్తా…
- కర్నూలును అభివృద్ధి పథంలో నడుపుతా..
- ఆదోనిలో మిల్లులు తెరిపించేందుకు కృషి చేస్తా…
- పత్తికొండలో టమోట జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తా..
- వేదావతి, గుండ్రేవుల ప్రాజెక్టులు పూర్తి చేస్తా…
- మాది రాజకీయ కుటుంబం…
- కాంగ్రెస్ కర్నూలు ఎంపీ అభ్యర్థి పి.జి. రాంపుల్లయ్య యాదవ్( లక్కీ 2)
రాష్ట్ర విభజన జరిగిన పదేళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో పాగా వేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటేందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి అభ్యర్థుల ఎంపికలో కసరత్తు పూర్తి చేసింది. వైసీపీ, టీడీపీలో టిక్కెట్ దొరకని అసంతృప్తివాదులను కాంగ్రెస్ బరిలో నిలుపుతోంది. దీంతో ఏపీలో వైసీపీ, కూటమి(జనసేన–బీజేపీ–టీడీపీ)తోపాటు కాంగ్రెస్ కూడా అన్ని నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టి…గట్టి పోటీ ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉంది. అందులో భాగంగా కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా లక్కీ2 రాంపుల్లయ్య యాదవ్‌ను బరిలో నిలిపింది. కాంగ్రెస్ అధిష్ఠానం ఏపీ అభివృద్ధికి తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు… ఏ పార్టీని టార్గెట్ చేస్తూ బరిలో నిలుస్తున్నారనే అంశాలపై … ‘ పల్లెవెలుగు ప్రతినిధి’ తో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి లక్కీ 2 రాంపుల్లయ్య యాదవ్‌ను ప్రత్యేక ఇంటర్వ్యూ చేసింది. ఆయన మాటల్లోనే…
కర్నూలు, పల్లెవెలుగు:
ప్రశ్న: రాష్ట్ర విభజన తరువాత…ఇన్నేళ్లు కాంగ్రెస్ ఒక్క సీటు కూడా దక్కించుకోలేదు కదా… మీరెలా పోటీలో దిగారు….
లక్కీ2 : రాంపుల్లయ్య రాష్ట్ర విభజన సమయంలోనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ అంగీకరించింది. బీజేపీ వాళ్లు 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేశారు. కానీ విభజన తరువాత కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. బీజేపీ ఇప్పటికీ ఇవ్వలేదు. మేము రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తాం. రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం మాకు ఉంది. అందుకే కాంగ్రెస్ కర్నూలు ఎంపీగా బరిలో దిగాను. విజయం సాధిస్తాను.
ప్రశ్న: పశ్చిమ ప్రాంత అభివృద్ధికి… తీసుకునే చర్యలేమిటి?
లక్కీ2: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే… రాయలసీమను రతనాల సీమగా తీర్చిదిద్దుతాం. కర్నూలు పార్లమెంట్ పరిధిలోని ఆలూరులో వేదావతి, గూడురులో గుండ్రేవుల ప్రాజెక్టులు పూర్తి చేస్తే… జిల్లాలో తాగు, సాగునీరుకు కరువు ఉండదు. హంద్రీనదిలో నీళ్లు పారేలా చర్యలు తీసుకుంటాం. అంతే కాదు… ఆదోనిలో మూతపడిన మిల్లులు తెరిపించేందుకు కృషి చేస్తా. వలసలు ఆపుతాం.
ప్రశ్న: పత్తికొండలో టమోటా జ్యూస్… ఎన్నో ఏళ్ల కల.. మీరైనా సాకారం చేస్తారా…?
లక్కీ 2: నేను గెలిస్తే.. కర్నూలు అభివృద్ధికి కట్టుబడి ఉంటా. పత్తికొండ ప్రజలు, రైతుల 50 ఏళ్లనాటి కల. టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఎందరినే అడిగారు. ప్రభుత్వాలు మారాయి. అధినేతలు మారారు. ఫలితం లేకపోయింది. నన్ను గెలిపిస్తే… పత్తికొండలో సొంత నిధులతో టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేస్తా. ఇందులో మాట తప్పేది లేదు. కట్టుబడి ఉంటా.
ప్రశ్న: ఎమ్మిగనూరు, కోడుమూరు అభివృద్ధిపై…. హామీ ఇవ్వగలరు…?
లక్కీ 2: చేనేతపురి (ఎమ్మిగనూరు)లో చేనేతలు అధిక సంఖ్యలో ఉన్నారు. ఎమ్మిగనూరు ప్రజల ఆకాంక్ష మేరకు చేనేతలు నేసిన బట్టలను కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పిస్తా. చేనేత వస్ర్తాలను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సరఫరా అయ్యేలా చూస్తా. కోడుమూరు ప్రజల అభ్యన్నతికి కృషి చేస్తా.
ప్ర: కర్నూలులో ప్రధాన సమస్య ఏమిటో.. గుర్తించారా…? ఏవిధంగా పరిష్కరిస్తారు..?
లక్కీ2 : కర్నూలు నగరంలో ప్రధాన సమస్య తాగునీరు. వేసవి వచ్చిందంటే నగరవాసులు నీటి కష్టాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. కర్నూలుకు మరో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మిస్తా. ఇందుకు ప్రభుత్వ భూమిని సేకరిస్తాం. కర్నూలు ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు సొంత నిధులు వెచ్చిస్తా. ఈ విషయంపై ప్రజలకు స్పష్టమైన హామీ ఇస్తున్నా.
ప్రశ్న: ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం మొదటిసారి కదా…. మీకు జిల్లాలో పట్టు ఉందా…?
లక్కీ2 : మాది రాజకీయ కుటుంబం. 40 ఏళ్లుగా మేము రాజకీయంగా ఉంటూ.. ప్రజలకు సేవ చేస్తున్నాం. . నాకు ఇష్టమైన రాజకీయ నాయకుడు కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, నందమూరి తారక రామారావు. వారి చొరవతోనే రాజకీయాల్లోకి వచ్చా. 1989లో కాంగ్రెస్ కర్నూలు నగర అధ్యక్షుడిగా పని చేశా. 1991లో జిల్లా ఉపాధ్యక్షుడిగా పార్టీకి, ప్రజలకు సేవ చేశా మా ఇంట్లో ముగ్గురు కార్పొరేటర్లుగా పని చేశారు.ప్రస్తుతం కూడా ఉన్నారు. 2010లో గొర్రెల మేకల పెంపకందారుల సంఘం అధ్యక్షుడిగా పని చేశా. 436 రెవెన్యూ గ్రామాల సొసైటీలలో మా ప్యానల్‌కు 400 ఓట్లు వచ్చాయి. అత్యధిక మెజార్టీతో గెలుపొందాము. 2013లో రాష్ట్ర ఫెడరేషన్ చైర్మన్‌గా ఎంపికయ్యాను. జిల్లాలో మా కుటుంబానికి మంచి పట్టు ఉంది. ఆదోని, ఆలూరు, పత్తికొండ, కర్నూలులో యాదవ సామాజిక వర్గం అధికంగా ఉంది.
ప్రశ్న: రాష్ట్రంలో వైసీపీ పాలనపై మీ అభిప్రాయం…?
లక్కీ 2 : వైసీపీ విముక్త రాష్ట్రమే లక్ష్యంగా పని చేస్తా. మా టార్గెట్ వైసీపీనే. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్ని వ్యవస్థలను నాశనం చేశారు. ఉద్యోగులు, కూలీలు, రైతులు, ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మేమే విజయం సాధిస్తాం. అధికారంలోకి వచ్చేది మేమే. మా పార్టీ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నాం. ఇప్పటికే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించాం. ప్రజల అభిప్రాయం తీసుకున్నాం.
ప్ర: కాంగ్రెస్ గ్యారంటీలు ఏమిటి….?..
లక్కీ 2: రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటోంది. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేందుకు సిద్ధంగా ఉన్నారు. మా పార్టీ అధికారంలోకి వస్తే…. ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు ప్రతి నెల రూ.8333, రైతు పెట్టుబడి మీద 50 శాతం లాభంతో మద్దతు ధర, కేంద్ర ద్వారా 30 లక్షలు, రాష్ట్రం ద్వారా 2.25 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే కల్పిస్తాం. ఉపాధి కూలీకి రోజుకు కనీసం రూ.400 వేతనం, వృద్దులకు, వితంతవువులకు రూ.4వేలు పింఛన్, వికలాంగలకు రూ.6వేలు పింఛన్, రైతు రుణమాఫీ రూ.2లక్షల వరకు, పదేళ్లు ప్రత్యేక హోదా, ఇల్లు లేని వారికి 5లక్షలతో ఇల్లు కట్టిస్తాం. కేజీ టు పీజీ వరకు పిల్లలకు ఉచిత విద్య అందిస్తాం. మా అధికార మ్యానిఫెస్టోలో ఈ హామీలు పొందుపరిచాం. ప్రజలందరూ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నా.
ప్రశ్న: ఏపీ అభివృద్ధిపై… కాంగ్రెస్ తీసుకునే చర్యలేమిటి?
లక్కీ 2: ఏపీ ప్రజలు ఒక్క సంక్షేమం మాత్రమే కోరడంలేదు. అభివృద్ధి కూడా కోరుతున్నారు. ఇది తెలియని వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పాలన అంటూ…. వివిధ పథకాల పేరిట ప్రజలకు నేరుగా వారివారి అకౌంట్లలోకి డబ్బులు వేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే… సంక్షేమంతోపాటు అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. సంపాదను సృష్టించే అద్భుతమైన ఐడియాలను కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అమలు చేస్తుంది. కాంగ్రెస్‌పై ప్రజలకు నమ్మకం ఉంది.