స్వార్థంతోనే.. సాదాపురంలో సర్పంచ్ ఎన్నికలు జరపలేదు..
1 min readనీకున్న వందెకరాలను కాపాడుకునేందుకేనా…?
- ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన కూటమి అసెంబ్లీ అభ్యర్థి డా. పార్థసారధి
- భూ కబ్జాలపై… దుర్గమ్మ గుడి వద్ద చర్చకు సిద్ధమా… అని సవాల్ విసిరిన వైనం
ఆదోని, పల్లెవెలుగు:నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీలలో సర్పంచ్ ఎన్నికలు జరిగితే…. ఒక్క సాదాపురం గ్రామంచాయతీలో మాత్రం ఎందుకు జరపలేదని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కూటమి అసెంబ్లీ అభ్యర్థి డా. పార్థసారధి ప్రశ్నించారు. ఎమ్మెల్యే , ఆయన కుటుంబీకుల పేరుతో వంద ఎకరాల భూమి ఇక్కడ ఉందని, ఎన్నికలు జరిపితే టీడీపీ–జనసేన–బీజేపీ అభ్యర్థి గెలిస్తే తమ భూ కబ్జాల కథ తెలిసిపోతుందనే ఎన్నికలు జరపలేదని ఘాటుగావిమర్శించారు. మంగళవారం సాయంత్రం సాదాపురం, గోనబావి గ్రామాల్లో కూటమి నేతలు విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా డా. పార్థసారధి మాట్లాడుతూ సర్పంచ్‌గా గెలిస్తే.. గ్రామాల అభివృద్ధికి ప్రతి సర్పంచ్‌కు కేంద్ర ప్రభుత్వం కోటి 25లక్షల నిధులు ఇస్తుందని, ఆ నిధులతో రోడ్లు, తాగునీరు, వీధిలైట్లు తదితర సమస్యల పరిష్కారానికి ఉపయోగపడతాయన్నారు. కానీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి సాదాపురం గ్రామపంచాయతీలో వంద ఎకరాల భూమి ఉందని, అందుకే గ్రామస్తులు అడిగినా ఎన్నికలు జరపలేదని ఆరోపించారు. ఎన్నికలు జరపకుండా.. కొన్నాళ్లకు ఆదోని మున్సిపాలిటీలో కలిపితే..తమ భూముల ధరలకు రెక్కలు వస్తాయని, ఈ పథకం పన్ని ఎన్నికలు జరపలేదా… అని ఎమ్మెల్యేను విమర్శించారు. తాను భూ కబ్జాలు చేయనని, అవినీతికి పాల్పడనని, తాను ఒక్క డాక్టర్ వృత్తిలో రాణిస్తున్నానని, మీకందరికీ సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తనను గెలిపిస్తే గోనబావి, సాదాపురం గ్రామాలను అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా డా. పార్థసారధి హామీ ఇచ్చారు. కమలం గుర్తుకు ఓటు వేసి.. వేయించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, మదిరె భాస్కర్ , కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.