పౌష్టికాహార లోపం, రక్తహీనత నివారణకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/18-6.jpg?fit=550%2C367&ssl=1)
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: చిన్నారుల ఆరోగ్య కరమైన భవిష్యత్తు కోసం రాష్ర్ట ప్రభుత్వం జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు.సోమవారం స్థానిక ఇందిరాగాంధీ స్మారక నగరపాలక ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను కలెక్టర్ అందజేశారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ చిన్న పిల్లల్లో, బాల బాలికల్లో పౌష్టికాహార లోపం , రక్తహీనతకు కారణమయ్యే నులిపురుగులను నివారించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేస్తుందన్నారు.. నులిపురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రతి ఒకరు ఆల్బెండజోల్ మాత్రలను వేసుకొని ఆరోగ్యంగా ఉండాలన్నారు…. ఏదైనా కారణం చేత 10 వ తేదిన మాత్రలు అందని పిల్లలకు 17 వ తేదీన మాత్రలను అందచేస్తారని కలెక్టర్ తెలిపారు. నులిపురుగులు శరీరంలో ఉంటే రక్త హీనత కు గురి కావల్సి వస్తుందని, అందువల్ల విద్యార్థులందరూ ఆల్బెండజోల్ మాత్రలను వేసుకోవాలని సూచించారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ముద్రించారని, ప్రతి రోజు పాఠశాలలో ప్రార్థన చేసే సమయంలో వాటిని చదవాలని కలెక్టర్ ఉపాధ్యాయులకు, విద్యార్థులకు సూచించారు . తెలిపారు.. భోజనం తినకముందు, తిన్న తర్వాత చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలన్నారు.. అదే విధంగా గోళ్లను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పండ్లను శుభ్రమైన నీటితో కడిగి తినాలన్నారు.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు.ఇందిరాగాంధీ స్మారక నగరపాలక ఉన్నత పాఠశాల తన ఇంటి పక్కనే ఉందని, పాఠశాలలో ప్రతిరోజు ఉదయం ప్రార్థన నిర్వహించే సమయంలో కానీ, పాఠశాలకు వచ్చేటప్పుడు, తిరిగి వెళ్ళేటప్పుడు విద్యార్థులు చాలా క్రమశిక్షణతో క్యూ లైన్ లో వెళ్లడం గమనించడం జరిగిందని కలెక్టర్ విద్యార్థులను అభినందించారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడుతూ నులిపురుగుల నివారణ పై ప్రశ్నలు వేసి, వారి సమాధానాల ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పి.శాంతికళ, జిల్లా విద్యాశాఖాధికారి శామ్యూల్ పాల్, RBSK PO డాక్టర్ శైలేష్ కుమార్, వైద్యాధికారి మాధవి, హెడ్ మాస్టర్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.