వైసీపీ ప్రభుత్వానికి… పింఛన్దారుల ఉసురు తగులుతుంది..
1 min readఅర్హులకు పింఛన్లు అందివ్వకుండా నాయకులు ఏం చేశారు..
టీడీపీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి టీజీ భరత్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఈ ప్రభుత్వానికి పింఛన్ల ఉసురు తగులుతుందని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భరత్ అన్నారు. నగరంలోని 9వ వార్డు తెలుగుగేరి ప్రాంతంలో ఆయన టీజీ భరత్ భరోసా యాత్ర కార్యక్రమం చేపట్టారు. ప్రతి ఇంటికి వెళ్లి పెద్దలు, మహిళలు, యువతను కలిసి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా మహిళలు రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ వైర్లు, పింఛన్ల సమస్యలను టిజి భరత్ తో మొరపెట్టుకున్నారు. నెలలు గడిచినా కాలువలు శుభ్రం చేయరని చెప్పారు. ఇక చేసేదేమీ లేక తామే సొంతంగా ఇంటిముందు కాలువలు శుభ్రం చేసుకున్నట్లు మహిళలు తెలిపారు. అనంతరం టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూల్ లోని 33 వార్డుల్లో ఇదే పరిస్థితి నెలకొందన్నారు. ఏ వీధికి వెళ్లినా కాలువల్లో మురుగు నిండిపోయి ఉంటుందన్నారు. కర్నూల్ నియోజకవర్గంలో ఎంతో మందికి పింఛన్లు అందడం లేదన్నారు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్న పింఛన్లు మంజూరు చేయకపోవడం దారుణమన్నారు. లేనిపోని నిబంధనలు పెట్టి సంక్షేమ పథకాలు దూరం చేయడం మంచిది కాదన్నారు. ఈ ప్రభుత్వానికి పింఛన్లు ఉసురు తప్పకుండా తగులుతుందన్నారు. అందరికీ సంక్షేమం అందిస్తామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం కర్నూల్ లో అర్హత కలిగిన వారికి ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. తమ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. సరైన వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎన్నుకోకపోతే పరిస్థితులు ఇలాగే ఉంటాయన్నారు. మరోసారి వైసీపీ ప్రభుత్వం వస్తే బానిసలుగా బ్రతకాల్సిందే అన్నారు. కర్నూల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే అర్హులకు ప్రతి ఒక్కరికి పింఛన్లు అందించే బాధ్యత తీసుకుంటానని టీజీ భరత్ హామీ ఇచ్చారు. కర్నూలుకు పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన కర్నూలు ఇంచార్జి ఆర్షద్, టిడిపి నేతలు శేషగిరి శెట్టి, శ్రీధర్, శ్రీనివాసులు, పూల రంగడు, సత్యనారాయణ, కుమార స్వామి, రమణ, కుమార్, షెరాజ్ ఆలీ ఖాన్, రహ్మత్ బాషా, జితేందర్, తదితరులు పాల్గొన్నారు.