పత్తికొండలో కందుల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి
1 min read
డి. రాజా సాహెబ్ – బి. సురేంద్ర కుమార్ లు డిమాండ్
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: రెవెన్యూ డివిజనల్ కేంద్రమైన పత్తికొండలో కందుల కొనుగోలు కేంద్రం ఏర్పాటు కై సంబంధిత శాఖ జిల్లా అధికారులు తక్షణమే స్పందించాలని సీపీఐ పత్తికొండ మండల కార్యదర్శి డి. రాజా సాహెబ్, ఆంద్రప్రదేశ్ రైతు సంఘం పత్తికొండ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బి. సురేంద్ర కుమార్ లు డిమాండ్ చేశారు.సీపీఐ, రైతు సంఘం బృందం గురువారం స్థానిక తహశీల్దార్ రమేష్ కు ఈమేరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డి. రాజా సాహెబ్, బి. సురేంద్ర కుమార్ లు మాట్లాడుతూ, పత్తికొండ ప్రాంతంలో అరకొర వర్షాలకు రైతులు పండించిన కంది పంటలకు కనీస మద్దతు ధర కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై వున్నదని వారు స్పష్టంచేశారు. అయితే ప్రభుత్వ అధికారులు ఈ ప్రాంతంలోని రైతులు పండించిన కంది పంట దిగుబడులును కొంటామని పత్తికొండ మండలం పుచ్చకాయల మాడ గ్రామంలో జనవరి 28 వ తేదీన డి. సి. ఎం. ఎస్. సొసైటీ ఆధ్వర్యంలో కందులు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించరని గుర్తు చేశారు.కేంద్రాన్ని ప్రారంభించడంతో ఈ ప్రాంత రైతులు ఎంతో సంతోషించారని తెలిపారు. ఐతే కందులు కొనుగోలు కేంద్రం రెండు రోజులకే మూతపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతన్నలు తాము పండించిన కందులు ను అమ్ముకోవచ్చు అన్న ఆశలు నిరుగారి పోయాయని తెలిపారు. మార్క్ఫెడ్ అధికారులు డి. సి. ఎం. ఎస్. సంస్థ కు కందులు కొనుగోళ్ళను అప్పజెప్పిందని, అయితే ఆ సంస్థ వారు అతి కొద్ది కందులు మాత్రమే కొనడానికి ముందుకు వచ్చారని ,దాంతో రైతులు దిక్కు దోచక తాము పండించిన కందులను ఎక్కడ అమ్ముకోవలో అర్థం కాక అధికారులు చుట్టు తిరుగుతున్నరని తెలిపారు. ఈ నేపద్యంలో కందులు కొనుగోలు కేంద్రం పూర్తిగా మూత పడిందని అన్నారు.