50 ఏళ్ల మహిళకు అరుదైన గుర్రపునాడా కిడ్నీ సమస్య
1 min read
విపరీతంగా వాచిపోయి, మెత్తబడిన ఒక మూత్రపిండం
రెండు కిడ్నీలు కలిసిపోవడంతో సమస్య తీవ్రతరం
అత్యాధునిక లాప్రోస్కొపిక్ సర్జరీతో తీసిన కర్నూలు కిమ్స్ వైద్యుల
పల్లెవెలుగు ,కర్నూలు : సాధారణంగా మనందరికీ రెండు కిడ్నీలు వేర్వేరుగా ఉంటాయి. కానీ, అత్యంత అరుదుగా కొందరికి మాత్రం గుర్రపునాడా ఆకారంలో ఉండి, కింది భాగంలో ఆ రెండూ కలిసిపోయి ఉంటాయి. ప్రతి 400-600 మందిలో ఒకరికి మాత్రమే ఇలా ఉంటుంది. అలాంటి కిడ్నీలు బాగా పనిచేసినంత వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ, వాటిలో ఒకటి పాడైతేనే తీవ్ర సమస్య. అలాంటి అత్యంత అరుదైన కేసులో కర్నూలు కిమ్స్ ఆస్పత్రికి చెందిన యూరాలజీ విభాగాధిపతి, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ వై. మనోజ్‌కుమార్ సంక్లిష్టమైన శస్త్రచికిత్సను లాప్రోస్కొపిక్ పద్ధతిలో చేసి, బాధితురాలికి ఊరట కల్పించారు. అందుకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు తెలిపారు.“కర్నూలు నగరానికి చెందిన 50 ఏళ్ల లక్ష్మీదేవికి పుట్టుకతోనే కిడ్నీలు గుర్రపునాడా ఆకారంలో ఏర్పడ్డాయి. ఇంతకాలం వాటితో ఎలాంటి ఇబ్బంది రాలేదు. కానీ కొంతకాలంగా ఆమె తీవ్రమైన కడుపునొప్పి, మధ్యమధ్యలో జ్వరం లాంటి లక్షణాలతో బాధపడుతున్నారు. అప్పుడప్పుడు మూత్రవిసర్జన సమయంలో మంట కూడా పుడుతోంది. ఈ సమస్యలతో ఆమె కర్నూలు కిమ్స్ ఆస్పత్రికి వచ్చారు. తగిన వైద్య పరీక్షలు చేసి చూడగా.. ఆమెకు ఉన్న గుర్రపునాడా కిడ్నీలలో కుడివైపుది బాగా వాచిపోయి, మెత్తబడిపోయి, పాడైపోయింది. కిడ్నీ సైజు బాగా పెరిగిపోవడం, దాంతోపాటు అది ఎడమవైపు దాంతో కలిసిపోవడం వల్ల శస్త్రచికిత్స బాగా కష్టంగా మారింది. మామూలుగా వేర్వేరు కిడ్నీల్లా ఉంటే.. రక్తసరఫరాను నిలిపివేసేందుకు క్లిప్ చేసి, అప్పుడు తీసేస్తాం. కానీ, ఇలాంటి కేసుల్లో రక్తనాళాలు కూడా కలిసిపోయి ఉంటాయి. ఏవి ఎందులోకి వెళ్తున్నాయో తెలియదు. అంతేకాక.. పాడైన కిడ్నీ తీసేటప్పుడు బాగున్న కిడ్నీకి గాయం కాకుండా చూసుకోవాలి.ఇలాంటి కేసులకు ఓపెన్ శస్త్రచికిత్సలే కష్టం. కానీ, రోగి వయసు దృష్ట్యా, లోపల ఉన్న పరిస్థితుల దృష్ట్యా లాప్రోస్కొపిక్ పద్ధతిలో చేయాలని నిర్ణయించాం. అత్యంత జాగ్రత్తగా చూసి.. రక్తసరఫరా నిలిపివేశాం. అలాంటప్పుడు బాగున్న ఎడమ కిడ్నీకి సరఫరా నిలిచిపోతే అదీ పాడైపోతుంది. అలా జరగకుండా చూసుకుంటూ, అత్యాధునిక లాప్రోస్కొపిక్ పరికరాలతో పాడైన కిడ్నీని జాగ్రత్తగా తొలగించాం. దీనికి దాదాపు రెండున్నర గంటలకు పైగా సమయం పట్టింది. ఎలాంటి ఇబ్బందులు లేకపోవడం, అలాగే రక్తస్రావం కూడా వీలైనంత తక్కువగానే ఉండడంతో రోగి చాలా త్వరగా కోలుకున్నారు.శస్త్రచికిత్స తర్వాత కూడా అంతా బాగుండడం, మూత్రవిసర్జన సాధారణం కావడంతో రోగిని నాలుగు రోజుల తర్వాత డిశ్చార్జి చేశాం. ఇలాంటి సంక్లిష్టమైన యూరాలజీ సమస్యలలో లాప్రోస్కొపిక్ పద్ధతి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. దీనివల్ల రోగికి శస్త్రచికిత్స తర్వాత నొప్పి చాలా తక్కువగా ఉంటుంది, త్వరగా కోలుకుంటారు. అత్యాధునిక యూరాలజీ సంరక్షణలో కర్నూలు కిమ్స్ ఆస్పత్రి ఎప్పటికప్పుడు సరికొత్త ప్రమాణాలను సృష్టిస్తోంది” అని డాక్టర్ వై.మనోజ్ కుమార్ వివరించారు.