ఒక్క ఈసీజీతో ఎన్నో ప్రయోజనాలు
1 min read
అనేక రకాల గుండె సమస్యలు గుర్తించొచ్చు
డయాగ్నసిస్ సరిగా ఉంటే గుండెపోటు నివారణ సాధ్యం
యువ వైద్యులకు పలువురు సీనియర్ల సూచనలు
ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రిలో రోజంతా ఈసీజీ సదస్సు
పాల్గొన్న కిమ్స్, యశోద, ఇతర ఆస్పత్రుల సీనియర్ గుండెవైద్యులు
పల్లెవెలుగు , హైదరాబాద్ : ఇటీవలి కాలంలో పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా చిన్న వయసులో కూడా అనేకమందికి గుండెపోటు వస్తోంది. దానివల్ల మరణాలు కూడా సంభవిస్తున్నాయి. అయితే ఒక సాధారణ ఈసీజీ తీయించుకుని, దాన్ని సరైన వైద్యుడికి చూపించుకుంటే గుండెలో ఉండే అనేక రకాల సమస్యలను గుర్తించవచ్చు. అయితే, మామూలు ప్రజలతో పాటు చాలామంది వైద్యులకు కూడా దీని గురించి అవగాహన ఉండడం లేదు. ఈ నేపథ్యంలో నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రిలో ఒక రోజంతా ఈసీజీ గురించి సుమారు 160 మంది యువ వైద్యులకు బేసిక్ అండ్ బియాండ్ ఈసీజీ పేరుతో ఒక అవగాహన సదస్సు నిర్వహించారు. దీనికి ప్రధాన కోఆర్డినేటర్‌గా ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి కార్డియాలజీ విభాగాధిపతి, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎ. సాయిరవిశంకర్ వ్యవహరించారు. ఇందులో యశోద ఆస్పత్రి సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సి. రఘు, కిమ్స్ ఆస్పత్రి కార్డియాలజిస్టు, ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ బి.హయగ్రీవరావు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కన్సల్టెంట్ కార్డియాలజిస్టు డాక్టర్ ముఖర్జీ, యశోద ఆస్పత్రి ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ గురుప్రసాద్, మహావీర్ ఆస్పత్రి కన్సల్టెంట్ కార్డియాలజిస్టు డాక్టర్ వై.శివకుమార్, ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ ఎంవీఎన్ సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయా వైద్య నిపుణులు మాట్లాడుతూ, ఒక్క ఈసీజీని సరిగా విశ్లేషించగలిగితే అందులో అనేక రకాల సమస్యల గురించి తెలుస్తుంది. గుండెలో ఉండే పలు రకాల మార్పులను ఈసీజీ సాయంతో సులభంగా గుర్తించవచ్చు. గుండెలో ఉండే ఎలక్ట్రోలైట్ మార్పులు, గుండె వేగం ఉన్నట్టుండి బాగా పెరిగిపోవడం, వివిధ కేసుల్లో ఈసీజీని బట్టి వీటన్నింటినీ ఎలా గుర్తించగలం అన్న విషయాలను సమగ్రంగా వివరించారు. అనంతరం ఇందులో పాల్గొన్న యువ వైద్యులకు ఈసీజీ గురించిన ప్రాథమిక విషయాలతో కూడిన ఒక క్విజ్ కూడా నిర్వహించారు. అపార అనుభవం ఉన్న వైద్యుల నుంచి ఈసీజీకి సంబంధించి ఇన్ని విషయాలు తెలుసుకోగలిగినందుకు ఇందులో పాల్గొన్న 160 మంది యువ వైద్యులు హర్షం వ్యక్తం చేశారు.