ఎమ్మెల్సీ ఎన్నికలను సమర్ధంగా నిర్వహించాలి…
1 min read
ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించిన ఎన్నికల పరిశీలకులు సిహెచ్. శ్రీధర్
జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ,జెసి పి.ధాత్రిరెడ్డి తో చర్చలు
పల్లెవెలుగు,ఏలూరుజిల్లా ప్రతినిధి: తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభధ్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలను సమర్ధంగా నిర్వహించాలని ఎన్నికల పరిశీలకులు సిహెచ్. శ్రీధర్ అన్నారు. శుక్రవారం ఏలూరు విచ్ఛేసిన ఎన్నికల పరిశీలకులు సిహెచ్. శ్రీధర్ స్ధానిక కలెక్టరేట్ లో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లాకలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి లతో చర్చించారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్ల వివరాలను తెలుసుకున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిధిలో నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభధ్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 456 పోలింగ్ కేంద్రాల్లో 3,14,984 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. వీరిలో 1,83,347 మంది పురుషులు, 1,31,618 మంది మహిళలు, 19 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారన్నారు. ఏలూరు జిల్లాలో 66 పోలింగ్ కేంద్రాల్లో 42,282 మంది తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వీరిలో 24,704 మంది పురుషులు, 17,571 మంది మహిళలు, 7 గురు ట్రాన్స్ జెండర్లు ఉన్నారన్నారు.ఈనెల 12వ తేదీన పివోలు, ఎపివోలు, మైక్రోఅబ్జర్వర్లకు శిక్షణ నిర్వహించామన్నారు.రెండవ విడత ఈనెల 22వ తేదీ ఉదయం 10 గం. లకు గోదావరి సమావేశ మందిరంలో పివోలు, ఎపివోలు, జోనల్, రూట్ అధికారులకు ట్రైనింగ్ పూర్తవుతుందని తెలిపారు. ఓటర్ల స్లిప్పుల పంపిణీ ప్రక్రియకూడా చేపట్టడం జరిగిందన్నారు.పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్లను వివరించారు. ఎంసిసి, ఎఫ్ఎస్ టి, ప్లైయింగ్ స్వ్కాడ్ లు కూడా ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికలకు సంబందించి 456 పోలింగ్ కేంద్రాలకు 1199 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశామని వాటిలో ఏలూరు జిల్లాకు సంబంధించి 66 పోలింగ్ కేంద్రాలకు 217 పెద్ద బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశామన్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి సంబంధిత అధికారులంతా వారికి నిర్ధేశించిన విధుల్లో నిమగ్నమైయున్నారన్నారు. ఈనెల 27వ తేదీన పోలింగ్ నిర్వహణకు డిస్ట్రిబ్యాషన్ సెంటర్లు, రిసెప్షన్ సెంటర్లు ఏర్పాట్లు కూడా చేపట్టామన్నారు. ఎన్నికల నిర్వహణకు 456 పోలింగ్ కేంద్రాలకు 2,714 మంది సిబ్బందిని నియమించామన్నారు. ఏలూరు జిల్లా పరిధిలో 66 పోలింగ్ కేంద్రాలకు 400 మంది ఎన్నికల సిబ్బందిని నియమించామన్నారు. జిల్లాలో 66 పోలింగ్ కేంద్రాలకు 66 మంది జోనల్ అధికారులను, 10 మంది రూట్ అధికారులను, 10 మంది సెక్టార్ అధికారులను నియమించామన్నారు.