గెలుపోటములు సమానంగా స్వీకరించినప్పుడే జీవితంలో ఎదుగుతారు…
1 min read
చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల్లో మంచి అవకాశాలు ఉన్నాయి.
జిల్లాస్థాయి ఫెన్సింగ్ క్రీడా పోటీల ప్రారంభ కార్యక్రమంలో సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ
పల్లెవెలుగు , కర్నూలు: గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి ముందుకు సాగినప్పుడే జీవితంలో ఎదిగే అవకాశం ఉంటుందని, ఇలాంటి అవకాశం క్రీడల్లో మాత్రమే లభిస్తుందని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. కర్నూల్ నగరంలోని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి ఫెన్సింగ్ క్రీడా పోటీల ను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు ,ప్రముఖ న్యాయవాది, క్రీడ దాత శ్రీధర్ రెడ్డి , ఫెన్సింగ్ క్రీడా శిక్షకుడు మహేశ్వరరావు ,మహేష్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు .ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ఒలంపిక్ అయిన ఫెన్సింగ్ క్రీడను కర్నూలు నగరంలో క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని చెప్పారు. ఫెన్సింగ్ క్రీడలో డిజిటల్ టెక్నాలజీ మిళితమై ఉందని, ఈ క్రీడలో రాణించిన వారికి ఉద్యోగ అవకాశాలు కూడా లభించి ఉండటం అభినందనీయమని చెప్పారు. ప్రతిభ ఉన్న వారు మాత్రమే ఈ క్రీడలో రాణించగలరని, ఈ క్రీడలో పాల్గొనడం వల్ల ఏకాగ్రత, మెడిటేషన్ వంటి ఆరోగ్యానికి ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయని వివరించారు. మనసులో ఎలాంటి ఇతర ఆలోచనలు లేనివారే క్రీడల్లో రాణిస్తారని ఆయన వివరించారు. క్రీడాకారులు విజయానికి పొంగిపోవద్దనీ, ఓటమికి నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదని వివరించారు .ప్రతి క్రీడాకారుడు ఓటమి నుంచి విజయం దిశగా అడుగులు వేయాలని ఆయన సూచించారు. గర్వం, అహంకారం ఉంటే జీవితంలో ఎదిగే అవకాశం ఉండదని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని చెప్పారు. విద్యార్థులు క్రీడలో పాల్గొనడం వల్ల స్మార్ట్ఫోన్ వినియోగానికి కొంత సమయం దూరంగా ఉండవచ్చని, ఫలితంగా ఊబకాయం ,మధుమేహం, రక్తపోటు వంటి జీవనశైలి సంబంధ వ్యాధులకు దూరంగా ఉండవచ్చు అని చెప్పారు. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒబేసిటీని తరిమి కొట్టాలని పిలుపునివ్వడం జరిగిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కర్నూల్ నగరంలో క్రీడల అభివృద్ధికి తన వంతు సహకారం నిరంతరం అందిస్తానని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ వెల్లడించారు.