రానున్న వేసవిలో ప్రజలకి త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక
1 min read
ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి
గోదావరి జలాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పరిశీలన
సమిష్టి కృషితో పనిచేయాలని అధికారులకు సూచనలు సలహాలు
ఏలూరు ప్రతినిధి న్యూస్ నేడు : రానున్న వేసవిలో ప్రజలకు త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో ముందడుగు వేస్తున్నట్లు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రజలు కూడా పూర్తి సహకారం అందించాలని, నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆయన సూచించారు. ఏలూరుకు సమీపంలోని ఆశ్రం ఆస్పత్రి వద్ద ఉన్న గోదావరి జలాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ను ఆయన పరిశీలించారు. రానున్న వేసవిలో ఏలూరు నగర ప్రజలకు త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూసేందుకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబుతో ఎప్పటికప్పుడు ఈ విషయమై చర్చిస్తూ, వారిరువురు కలసి నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రణాళికాబద్దంగా చర్యలకు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా ఆశ్రం ఆస్పత్రి వద్ద ఉన్న గోదావరి జలాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. నూతనంగా మోటారు ఏర్పాటుచేయడం, ట్రాన్స్ ఫార్మర్ మార్పుచేయడం, తూడు తొలగింపు పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. వీటిని బుధవారం ఎమ్మెల్యే బడేటి చంటి అధికారులతో కలసి పరిశీలించారు. పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు నీటి ఎద్దడి తలెత్తకుండా అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్ళామన్నారు. దీనిపై స్పందించిన మంత్రి ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ తో మాట్లాడి, సమస్యను పరిష్కరించాలని ఆదేశించారని చెప్పారు. తగ్గిన నీటిమట్టాన్ని యధాస్థితికి తీసుకువస్తే వేసవిలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని, దీన్ని దృష్టిలో ఉంచుకునే అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామన్నారు. అధికారులంతా సమిష్టిగా కృషిచేస్తున్నారని, అయితే ప్రజలు కార్పొరేషన్ అధికారులకు పూర్తిసహకారం అందించాలన్నారు. నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కార్పొరేషన్ ఎంఈ సురేంద్రబాబు, ఇరిగేషన్ జేఈ సుబ్రహ్మణ్యం, టీడీపీ నాయకులు వందనాల శ్రీనివాసరావు, ఆర్నేపల్లి తిరుపతి తదితరులు ఉన్నారు.
