రవీంద్ర విద్యాసంస్థల్లో సైన్స్ ఎక్స్పో….
1 min read
కర్నూలు , న్యూస్ నేడు: స్థానిక అబ్బాస్ నగర్ లోని రవీంద్ర విద్యాసంస్థలలో నేడు డాక్టర్ సి.వి.రామన్ జన్మదినాన్ని పురస్కరించుకొని సైన్స్ ఎక్స్పో నిర్వహించడం జరిగింది. విద్యార్థులు ప్రదర్శించిన సృజనాత్మకత అంశములపై ఈ సైన్స్ ఎక్స్పో నిర్వహించారు. లో కాస్ట్ ,నోకాస్ట్ నుదృష్టిలోఉంచుకొని ఈ ఎక్స్పోలో కృత్యములు ప్రదర్శింపబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రవీంద్ర విద్యాసంస్థల అధినేత శ్రీ జి. పుల్లయ్య మరియు అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ మమతా మోహన్ విచ్చేశారు. జి.పుల్లయ్య విద్యార్థులతో మాట్లాడుతూ మనిషి జీవితానికి సైన్స్ ఎంతో ముడిపడి ఉందన్నారు. ఈ ఆధునిక యుగములో ప్రకృతిలో వచ్చిన మార్పుల వల్ల మానవాళి కొత్త కొత్త వైరస్ల బారిన పడి ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది. మధ్యతరగతి కుటుంబీకులు ఈ వైద్య ఖర్చులు భరించలేక ప్రాణాలు కోల్పోతున్నారు. కావున మేధావులైన మీ విద్యార్థి బృందము తక్కువ ఖరీదులో మంచి వైద్యమును అందించి ప్రజల ప్రాణాలను కాపాడే సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలకాలన్నారు. అలాగే మీరు నేర్చుకోబోయే ప్రతి అంశాన్ని పరిశీలన, పరిశోధనతో క్షుణ్ణంగా అధ్యయనం చేసి చదివి ఉత్తములుగా ఎదగాలన్నారు.అనంతరం డాక్టర్ మమతా మోహన్ మాట్లాడుతూ నేడు మీరు మీ మేధస్సుతో ప్రదర్శించిన ఈ అంశాలు చిన్నవే కావచ్చు, కానీ భవిష్యత్తుకు పెద్ద ఆవిష్కరణలుగా రూపాంతరం చెందాలని తమ ఆశీస్సులను విద్యార్థులకు అందజేశారు.విశ్వములోని రహస్యాలు మన విజ్ఞానముతో కళ్ళ ముందు ఆవిష్కృతమవుతున్నాయన్నారు. సైన్సును ప్రతి విద్యార్థి జీవితంలో భాగస్వామిగా చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సైన్స్ అధ్యాపకులు సజ్జాద్, అనిల్ కుమార్, చంద్రశేఖర్, సుజాత, వసుంధర, రేణుక, లలిత తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ నమూనాలు ప్రదర్శించిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.
