స్ట్రాంగ్ రూమ్ లకు చేరుకున్న బ్యాలెట్ బాక్సులు
1 min read
అభ్యర్థుల సమక్షంలో బాలెట్ బాక్సులకు సీలు వేసి స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచిన అధికారులు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. 6 జిల్లాలైన ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా, కాకినాడ జిల్లాల నుండి పటిష్టమైన పోలీసు భద్రతతో బ్యాలెట్ బాక్సులను సిబ్బంది గురువారం రాత్రి నుండి శుక్రవారం ఉదయం వరకు తీసుకువస్తూనే ఉన్నారు. సీళ్లు వేసిన బ్యాలెట్ బాక్సులను ఏలూరు సర్. సి. ఆర్. రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూంలలో సంబంధిత రెవిన్యూ డివిజినల్ అధికారులు అభ్యర్థుల సమక్షంలో బ్యాలెట్ బాక్సులకు సీలు వేసి, స్ట్రాంగ్ రూములకు తరలించారు. బ్యాలెట్ బాక్సులను భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్ ల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటుచేశారు. ఎన్నికల పరిశీలకులు సిహెచ్ శ్రీధర్, జిల్లా కలెక్టర్ మరియు రిటర్నింగ్ అధికారి కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి .ధాత్రిరెడ్డి, డిఆర్ ఓ వి. విశ్వేశ్వరరావు, ఆర్డీఓలు అచ్యుత్ అంబరీష్, రమణ, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ భానుప్రతాప్ , ఏలూరు తహసిల్దార్ శేషగిరిరావు, ప్రభృతులు పాల్గొన్నారు.
