యువతలో మూత్రసమస్యలకు ఏఐఎన్‌యూలో సరికొత్త పరిష్కారం
1 min read
ఔట్ పేషెంట్ పద్ధతిలో వెసులుబాటు
సిగ్గుతో బస్సులు కూడా ఎక్కలేని పరిస్థితి
హైదరాబాద్, న్యూస్ నేడు : ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) వైద్యులు మూత్ర సంబంధిత సమస్యలకు ఓ సరికొత్త, అత్యాధునిక, విప్లవాత్మక పరిష్కారం చూపించారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన 38 ఏళ్ల వ్యక్తి మూత్రవిసర్జనకు చాలా ఇబ్బంది పడుతున్నారు. పదే పదే వెళ్లాల్సి రావడం, అక్కడకు వెళ్లాక సరిగా విసర్జన కాకపోవడం, మళ్లీ బ్లాడర్ నిండుగా ఉన్నట్లు అనిపించడం లాంటి ఇబ్బందులు అతడికి ఉన్నాయి. ఈ పరిస్థితిని ప్రైమరీ బ్లాడర్ నెక్ అబ్స్ట్రక్షన్ (పీబీఎన్ఓ) అంటారు. మూత్ర సమస్యలు వేధిస్తున్న 55 ఏళ్లలోపు పురుషుల్లో దాదాపు 33–45% మందికిపీ బీఎన్ఓ ఉంటుంది. అలాగే దిగువ మూత్రనాళ లక్షణాలు (ఎల్యూటీఎస్) ఉన్నవారికీ పీబీఎన్ఓ ఎక్కువగానే కనిపిస్తుంది. దీని పరిష్కారానికి ఏఐఎన్‌యూ వైద్యులు ఐటీఇండ్ అనే సరికొత్త పరికరాన్ని ఎంచుకున్నారు. ఇది తాత్కాలికంగా అమర్చే చిన్నపాటి పరికరం. దేశంలోనే అతికొద్ది కేంద్రాల్లోనే ఇది అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఎనిమిది పేషెంట్లకు విజయవంతంగా ఈ చికిత్సను ఏ ఐ ఎన్ యు అందించింది.దీని గురించి ఏఐఎన్‌యూకు చెందిన కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ మద్దూరి విజయ్ కుమార్ శర్మ పలు వివరాలు తెలిపారు. “ఈ పరికరాన్ని మూత్రనాళంలో బ్లాడర్ నెక్ వద్ద అమరుస్తారు. ఏడు రోజుల తర్వాత దాన్ని తీసేస్తారు. ఈ సమయంలో బ్లాడర్ నెక్ వద్ద మూత్రం సులభంగా పోయేందుకు వీలుగా మూడుచోట్ల ఛానల్స్ ఏర్పాటవుతాయి. ఏడు రోజుల తర్వాత ఈ పరికరం తీసేసినా, ఆ ఛానల్స్ అలాగే ఉంటాయి. దాంతో మూత్రవిసర్జన మామూలుగా అవుతూ.. రోగులకు సమస్య ఉన్నట్లే దాదాపుగా తెలియదు. ఇదంతా మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతిలోనే చేస్తారు. ఎక్కడా కణజాలాలు కోయాల్సిన అవసరమే ఉండదు. పైపెచ్చు, సాధారణంగా యూరాలజీ శస్త్రచికిత్సలు చేసినప్పుడు లైంగిక సామర్థ్యం చాలావరకు తగ్గుతుంది గానీ, ఇందులో దానిపై ఎలాంటి ప్రభావం పడదు.పీబీఎన్ఓ సమస్య ఉన్నవారు చాలా ఇబ్బంది పడతారు. సాధారణంగా పురుషులు రోజులో నాలుగైదు సార్లు మూత్రానికి వెళ్తే, ఈ సమస్య ఉన్నవారు ప్రతి గంటకీ వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు మూత్రవిసర్జన చేయడానికి ఇబ్బంది పడతారు. పూర్తిగా అయినట్లు అనిపించదు. దాంతో సమావేశాల్లో పాల్గొనాలన్నా, బస్సులు ఎక్కాలన్నా సిగ్గుతో ఇబ్బంది పడతారు. సహజంగా ఉండే సిగ్గు వల్ల వైద్యుల వద్దకూ వెళ్లరు. ఎక్కువసేపు అలా మూత్రం లోపలే ఉండిపోవడంతో కిడ్నీలు కూడా దెబ్బతింటాయి. పశ్చిమగోదావరి కేసులో సమస్యను వెంటనే గుర్తించి, ఐటీఇండ్ పరికరం అమర్చడంతో అతడి సమస్య మొత్తం పరిష్కారమైంది. దీన్ని ఔట్‌పేషెంట్ విభాగంలోనే అమరుస్తారు, అదేరోజు వెళ్లిపోవచ్చు. చిన్నపాటి లోకల్ ఎనస్థీషియా ఇస్తే సరిపోతుంది కాబట్టి హృద్రోగులు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికీ ఇబ్బంది ఉండదు. ఇది అమర్చడం వల్ల మచ్చలు, కుట్లు కూడా ఉండవు. ఐటీఇండ్ పరికరం ప్రోస్టేట్ను, బ్లాడర్ నెక్‌ను తెరుస్తుంది. దీనివల్ల గ్రంధి పొడవునా ఒక ఛానల్ ఏర్పడుతుంది. తర్వాత ఐదు నుంచి ఏడు రోజుల్లో మొత్తం బ్లాక్ అయిన ప్రాంతాన్ని ఇది తెరుస్తుంది. దీనివల్ల లైంగిక సామర్థ్యం తగ్గడం అనే దుష్ప్రభావం ఉండదు. సంప్రదాయ చికిత్సల్లో ప్రోస్టేట్ను కొంత తొలగిస్తాం. అందువల్ల వీర్యస్ఖలనం సామర్థ్యం పోవచ్చు. ఐటీఇండ్లో కోతలే ఉండవు కాబట్టి, లైంగిక సామర్థ్యం యథాతథంగా ఉంటుంది” అని డాక్టర్ విజయ్‌కుమార్ శర్మ వివరించారు.
