NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాయలసీమలో వలసలు లేకుండా చూడాలన్నదే మా లక్ష్యం

1 min read

మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి గురువైభవోత్సవాల్లో మంత్రి నారా లోకేష్

శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని పాదుకా పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొన్న మంత్రి

కర్నూలు, న్యూస్​ నేడు:  రాయలసీమలో వలసలు లేకుండా చూడాలన్నదే తమ లక్ష్యమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో మంత్రి పర్యటించారు. శ్రీ రాఘవేంద్ర స్వామి గురువైభవోత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మార్చి 1వ తేదీ శనివారం నుంచి ఆరు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. 6వ తేదీ శ్రీ రాఘవేంద్ర స్వామి జన్మదిన వేడుకలు జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీ రాఘవేంద్ర స్వామి పీఠాన్ని అధిష్టించిన పరమ పవిత్ర రోజును పురస్కరించుకుని మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థుల వారి ఆధ్వర్యంలో నిర్వహించిన 404వ పాదుకా పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొన్నారు. స్వామి వారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కోరిన కోర్కెలు తీర్చే దేవుడు శ్రీ రాఘవేంద్రస్వామి. రాఘవేంద్రస్వామి గురువైభవోత్సవాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. కూటమి ప్రభుత్వంలో ప్రజలు సుఖ, సంతోషాలతో ఉండాలి. ఇందుకోసం అహర్నిశలు కృషిచేస్తాం. రాయలసీమలో వలసలు లేకుండా చూడాలన్నదే మా లక్ష్యం. వర్షాలు బాగా కురవాలని కోరుకుంటున్నాను. ప్రజలు, దేవుని ఆశీస్సులు మాకు ఉండాలని అన్నారు.  పట్టాభిషేక మహోత్సవం అనంతరం మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు వారు మంత్రి లోకేష్ ను శాలువాతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు ఆలయ నిర్వాహకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా మాంచాలమ్మ అమ్మవారిని దర్శించుకుని మంత్రి నారా లోకేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు పొందారు.

రథోత్సవంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్

పట్టాభిషేక మహోత్సవం అనంతరం ఆలయంలో నిర్వహించిన రథోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. మంగళవాయిద్యాలు, అశేష భక్త జనసందోహం మధ్య రథాన్ని లాగారు. శ్రీ రాఘవేంద్రస్వామి నామస్మరణతో దేవాలయ ప్రాంగణం మారుమోగింది. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్  పి.రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి,కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మంత్రాలయం టీడీపీ ఇంఛార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *