ఏలూరులో ….కదం తొక్కిన కోకో రైతులు
1 min read
కోకో గింజలు కొనుగోలు సమస్యపై జిల్లా కలెక్టరేట్ ముందు కోకో రైతుల మహాధర్నా
కోకో గింజలు, కోకో కాయలతో వినూత్న రీతిలో కోకో రైతుల నిరసన.. భారీ ప్రదర్శన
కోకో రైతుల చలో ఏలూరు కార్యక్రమంతో దద్దరిల్లిన జిల్లా కలెక్టరేట్
అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కిలో కోకో గింజలకు రూ. 900 ధర ఇవ్వాలి
రైతుల వద్దనున్న కోకో గింజలు వెంటనే కొనుగోలు చేయాలి
కంపెనీలు సిండికేట్ గా మారి రైతులను నష్టపరచడాన్ని అరికట్టాలి
కోకో రైతులను ఆదుకోకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తాం
ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం – ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు హెచ్చరిక
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : కోకో గింజలు కొనుగోలు సమస్యపై ఏలూరులో కోకో రైతులు కదం తొక్కారు. కోకో రైతుల చలో ఏలూరు కార్యక్రమం సందర్భంగా కోకో గింజలు,కోకో కాయలతో మహా ధర్నా నిర్వహించి, వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. కంపెనీలు సిండికేట్ గా మారి కోకో రైతులకు ధర తగ్గించి వేసి నష్టం కలిగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కోకో రైతుల నినాదాలతో కలెక్టరేట్ ఆవరణం దద్దరిల్లింది. తమ ఆదుకోవాలంటూ కలెక్టరేట్ నుండి ఫైర్ స్టేషన్ మీదుగా ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్దకు చేరుకుని మహా ధర్నా కొనసాగించారు. అనంతరం జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వికి వినతి పత్రం అందజేశారు. ముందుగా జరిగిన మహాధర్నాను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ కోకో గింజలు కొనుగోలు కంపెనీలు సిండికేట్ గా మారి కోకో రైతులను ఇబ్బందులు గురిచేస్తున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడం అన్యాయమని విమర్శించారు. రైతులను నష్టపరుస్తున్న కోకో గింజల కొనుగోలు కంపెనీల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరారు. కోకో గింజలను అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కిలోకు రూ.900 ధర కల్పించి కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 50వేల ఎకరాలలో కొబ్బరి, ఆయిల్ పామ్ అంతర పంటగా కోకో సాగు జరుగుతున్నదని,ఏలూరు జిల్లాలో రాష్ట్రం అత్యధిక విస్తీర్ణం ఉందన్నారు. మన దేశ అవసరాలకు తగినంతగా కోకో గింజల ఉత్పత్తి లేదని,విదేశీ దిగుమతులపై ఆధారపడుతున్నామని చెప్పారు.ఘనా వంటి ఆఫ్రికా దేశాల నుండి కోకో గింజలు దిగుమతి చేసుకుంటున్నామని వివరించారు. మన దేశ అవసరాలలో 20 శాతం మాత్రమే ఇక్కడ ఉత్పత్తి జరిగి, 80% విదేశీ దిగుమతులపై ఆధారపడుతున్నామని చెప్పారు. కోకో గింజలు విదేశీ దిగుమతులు తక్షణమే నిలుపుదల చేసి రైతులు వద్దనున్న గింజలు వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కోకో రైతుల కొనుగోలు సమస్యను తక్షణమే పరిష్కరించాలని, కొనుగోలు కంపెనీలతో రైతుల సమక్షంలో ప్రభుత్వం చర్చలు జరిపి తగు చర్యలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే కోకో రైతుల సమస్యలపై ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం నాయకులు బొల్లు రామకృష్ణ,ఎస్. గోపాలకృష్ణ,జె.కాశీ బాబు, ఎల్.గోపాలరావు, పి.అచ్యుతరామయ్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు, విజయరాయి ప్రాంతీయ కొబ్బరి రైతుల సంఘం ఉపాధ్యక్షులు ఎం.సుబ్బారెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం అంతర్జాతీయ మార్కెట్ లో కిలో కోకో గింజలకు రూ.1000 వరకు ధర వచ్చిందని,ఎన్నో ఏళ్ల నుండి కష్టపడుతున్న మనకు ఆధర రైతుకు రావడంతో ఎంతో సంతోషించామని చెప్పారు. అయితే ఆ సంతోషం ఎంతో కాలం లేదన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ లో కిలో కోకో గింజలకు రూ.900 వరకు ధర ఉన్నా ప్రస్తుతం కోకో గింజలు కొనుగోలు కంపెనీలు ఆధర చెల్లించడం లేదని చెప్పారు. పాత,కొత్త గింజల పేరుతో కోకో రైతులను కంపెనీలు ఇబ్బందులు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీలు సిండికేట్ గా మారి కిలో కోకో గింజలకు రూ.500 నుండి రూ.600 వరకు ధర ఇస్తున్నాయని ఈధర రైతుకు సరిపోదన్నారు. ఇంతకుముందు లేనివిధంగా గ్రేడింగ్ విధానం తీసుకొచ్చి రైతులను ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోకో గింజల కొనుగోలు సందర్భంగా ఎటువంటి నాణ్యతా ప్రమాణాలు నిర్ణయించలేదన్నారు. కంపెనీలు చెప్పిన విధంగా తయారు చేసిన కోకో గింజలను కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయన్నారు. కోకో గింజలు ధర పెరిగిన తర్వాత కౌలు రేట్లు పెరిగాయని కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఎరువులు ధరలు, కూలీ ఖర్చులు పెరిగాయన్నారు. కోకో గింజలు కొనుగోలు సమస్యపై ప్రభుత్వం, అధికారులు వెంటనే జోక్యం చేసుకుని కోకో రైతులకు న్యాయం చేయకపోతే కంపెనీల మోసాలకు గురై పెద్ద ఎత్తున నష్టపోయి అప్పుల పాలై ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఈ పరిస్థితులలో జిల్లా కలెక్టర్,ఉద్యాన శాఖ అధికారులు, ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని రైతులు వద్ద ఉన్న కోకో గింజలను అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా కిలోకు రూ. 900 ధర ఇచ్చి కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.
కోకో రైతుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి
అనంతరం జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి కి ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం నాయకులు, కోకో రైతులు వినతి పత్రం అందజేశారు. కోకో రైతుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్ రైతులతో కొద్దిసేపు చర్చలు జరిపి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉద్యాన శాఖ కమిషనర్, ప్రభుత్వం దృష్టికి కోకో రైతుల సమస్యలు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కోకో గింజలు కొనుగోలు కంపెనీలతో వెంటనే సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని ఆమె చెప్పారు. కోకో గింజలు కొనుగోలు సమస్య పరిష్కారానికి తగు చర్యలు చేపడతామని చెప్పారు. సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ కు కోకో రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఏలూరు త్రీ టౌన్ సిఐ కోకో రైతులు పట్ల దురుసుగా వ్యవహరించడంపై కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం, కొబ్బరి రైతుల సంఘం నాయకులు గుది బండి రమేష్ రెడ్డి, కోనేరు సతీష్, నరసింహారావు, లోకేష్, బి. సుబ్బారావు, బొబ్బా రమేష్, వి.రాంబాబు, జి శ్రీనివాస్, ఎం.నరేంద్ర, పి. కృష్ణ, ఎస్ రాంబాబు, వి.నాగరాజు, ఎం.శాంతరాజు, ఎం.సత్యనారాయణ,ఎన్. లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లాతో పాటు పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి,ఎన్టీఆర్,కృష్ణా తదితర జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో కోకో రైతులు తరలివచ్చారు.